Health | పసుపు తింటే రోజూ ఎక్సర్సైజ్ చేసినట్టే!చిటికెడు పసుపు చాలు. వ్యాయామాలతో సమానమైన ప్రయోజనాలు అందిస్తుంది. గుండెకు ప్రయోజనం కలిగిస్తుంది. పసుపు గుండెపోటు ముప్పును 41 శాతం తగ్గిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులోని ‘కర్క్యుమా’ అనే పదార్థం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. వంటల్లో వేసే చిటికెడు పసుపు వల్ల పరిపూర్ణమైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. పరిశోధకులు తమ అధ్యయనం కోసం… వివిధ వయసుల్లో ఉన్న 100 మంది మహిళలను మూడు వర్గాలుగా విభజించారు. మొదటి వర్గంవారి ఆహారంలో పసుపును జతచేశారు. రెండో వర్గం వారికి కేవలం వ్యాయామమే సూచించారు. మూడో వర్గం వారికి ఆహారంలో పసుపును భాగం చేయలేదు. వ్యాయామం కూడా చేయొద్దని తెలిపారు.
రెండు నెలల తర్వాత పసుపు తీసుకున్నవాళ్లు, వ్యాయామం చేసిన వాళ్లలో గుండె ఆరోగ్యం, రక్తం పనితీరులో ఒకే విధమైన మార్పులు కనిపించాయి. మూడో వర్గం వారిలో ఈ మార్పులేమీ కనిపించలేదు. వ్యాయామం చేసే వర్గంతో వారంలో మూడుసార్లు సైక్లింగ్, వాకింగ్, ఏరోబిక్ వ్యాయామాలు చేయించారు. పసుపు తినే వారికి రోజుకు 150 మిల్లీగ్రాములు మోతాదు సూచించారు. 60 రోజుల తర్వాత ఫలితాలను పరిశీలించారు. అయితే, ఇందులో గుండె ఆరోగ్యం, రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరును మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. మిగిలిన ఆరోగ్య సూచికలను పరిగణించ లేదు. అలా అని, పసుపు తింటే వ్యాయామం మానేయాలని మాత్రం కాదు!