శరీర కణాల నిర్మాణం, మరమ్మతులు, పెరుగుదల, గాయాల నుంచి విముక్తి, ఎముకల వృద్ధి.. మొదలైన వాటికి ప్రొటీన్లు అత్యవసరం. అవి కనుక తగినపాళ్లలో అందకపోతే శరీరం అనారోగ్యం బారిన పడుతుంది. మాంసం, పాలపదార్థాలు, పప్పుధాన్యాలు, పాలకూర లాంటివి ప్రొటీన్లకు సహజ వనరులు. శరీరంలో ప్రొటీన్ల లోపాన్నిశరీరమే గుర్తుచేస్తుంది. సమతులాహారంతో ప్రొటీన్ల లోపాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. డాక్టర్ను సంప్రదిస్తే తగిన సప్లిమెంట్లనూ సూచిస్తారు. ప్రొటీన్ల లోపానికి సంబంధించి శరీరం ఇచ్చే సంకేతాలను కూడా అర్థం చేసుకోవాలి.
శరీరంలో కండర కణజాలం నిర్మాణానికి ప్రొటీన్లు అవసరం. కండరాల ద్రవ్యరాశి వేగంగా తగ్గుతున్నా, కండరాల బరువు తగ్గుతున్నా అది ప్రొటీన్ల లోపానికి సంకేతమే. కండరాల్లో మంట, నొప్పి, పట్టేయడం లాంటివి కూడా ప్రొటీన్ల లోపాన్ని సూచిస్తాయి.
మెదడు కణజాలం ఆరోగ్యానికి, మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ స్థాయుల స్థిరత్వానికి ప్రొటీన్లు అత్యవసరం. ఇవి తగిన మోతాదులో ఉంటేనే మెదడు చురుగ్గా ఉంటుంది. కాబట్టి, తరచూ జ్ఞాపకశక్తి సమస్యలు ఏర్పడినా, ఏకాగ్రత లోపం లాంటివి పీడిస్తున్నా ప్రొటీన్ల లోపానికి సంకేతంగానే భావించాలంటారు నిపుణులు.
జుట్టు, చర్మం, గోళ్లు లాంటివాటిలో ప్రధానంగా ప్రొటీన్లు ఉంటాయి. వెంట్రుకలు రాలడం, గోళ్లు పెళుసుబారడం, చర్మంపై పొలుసులు ఏర్పడటం, వెంట్రుకలు నెరిసిపోవడం, చర్మం మీద ముడతలు లాంటి లక్షణాలు ప్రొటీన్ల లోపానికి సూచనలు. చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి ఆహారంలో తగిన మోతాదులో ప్రొటీన్లు ఉండాల్సిందే.
గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతున్నదంటే.. అది ప్రొటీన్ల లోపం వల్లే కావచ్చు. ఎందుకంటే, నశించిపోయిన కణజాలాన్ని కొలాజెన్ మరమ్మతు చేస్తుంది. కొలాజెన్ తయారీకి ప్రొటీన్లు అత్యవసరం.
హఠాత్తుగా ఆకలి పెరిగి పోవడం, ఎంత తిన్నా తిననట్టే ఉండటం, వేగంగా బరువు పెరగడం.. లాంటివి ప్రొటీన్ల లోపానికి సూచనలే. శరీరం ప్రొటీన్ల కొరతను ఎదుర్కొంటున్నప్పుడు కణాలు, కణజాలాలు బలహీనపడతాయి. దాంతో సహజంగానే శరీరం మరింత ఆహారం కోసం తపిస్తుంది. ముఖ్యంగా చక్కెర, కొవ్వులు అధికంగా ఉన్న ఆహార పదార్థాల కోసం వెంపర్లాడుతుంది. శరీరం త్వరగా తృప్తి చెందేది వీటివల్లే కాబట్టి ఇలా జరుగుతుంది.
శరీరం తగిన మేర ప్రొటీన్లు తీసుకోకపోతే.. ఆ పరిణామం ఆల్బుమిన్ స్థాయుల తగ్గుదలకు దారితీస్తుంది. ఆల్బుమిన్ తగ్గినప్పుడు, శరీర కణజాలంలో ద్రవాలు పేరుకుపోతాయి. శరీరంలో కొన్ని భాగాల్లో వాపు ఉన్నా, ఒళ్లంతా బరువుగా అనిపించినా, కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతున్నా.. అది ప్రొటీన్ల లోపమే కావచ్చు.