న్యూఢిల్లీ : ఆరోగ్యానికి మేలుచేసే దానిమ్మలో రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే గుణాలతో పాటు గాయాలను నయం చేసే సత్వర శక్తిని ప్రసాదించే పోషకాలు మెండుగా ఉన్నాయని హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నారు. వాపు ప్రక్రియను నివారించే యాంటీఆక్సిడెంట్లు దానిమ్మ పండులో ఉండటం గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. రెడ్ వైన్, గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెండ్లకు మూడు రెట్లు అధికంగా దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు.
కాలుష్యం, ధూమపానంతో పేరుకుపోయే టాక్సిన్స్‌ను శుభ్రపరిచేందుకు ఉపకరించే యాంటీఆక్సిడెంట్లు, క్యాన్సర్ నివారించే ఔషధ గుణాలు ఈ అద్భుత ఫలంలో మెండుగా ఉంటాయి. క్యాన్సర్‌కు దారితీసే డీఎన్ఏ విధ్వంసాన్ని అడ్డుకునే గుణాలు దానిమ్మలో పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ రసంతో హానికారక ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బీపీ అదుపులో ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయని హార్వర్డ్ నివేదిక పేర్కొంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన ఫైబర్ దానిమ్మపండ్లలో అధికం. కప్పు దానిమ్మ గింజల్లో ఏకంగా ఏడు గ్రాముల పైబర్ ఉంటుంది.