డయాబెటిస్ జీవనశైలికి సంబంధించిన రుగ్మత. ఇక మహిళల్లో ఈ వ్యాధితో తలెత్తే జబ్బుల్లో గుండె పోటు, ఎముకల నొప్పి ప్రధానమైనవి. గుండె, ఎముకల ఆరోగ్యం విషయంలో మధుమేహం ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి.
గుండె జబ్బులు, గుండెపోటు ముప్పును మధుమేహం రెండు రెట్లు పెంచుతుంది. అంతేకాకుండా ఇతరులతో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవారికి చిన్నవయసులోనే గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఎక్కువ. ఎంత ముందుగా షుగర్ బారిన పడితే గుండె జబ్బులు వచ్చే ముప్పు అంత ఎక్కువగా ఉంటుంది. అయితే, నడక, వ్యాయామం, మితాహారంలాంటి కొన్ని జీవనశైలి మార్పులతో హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. దాంతోపాటు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు కూడా.
షుగర్ వ్యాధిగ్రస్తుల్లో, అందులోనూ టైప్ 1 డయాబెటిస్ రోగుల్లో ఎముకల బలహీనత సాధారణమైన సమస్య. వీరిలో ఎముకల పగుళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్లు, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోనివాళ్లకు ఎముకల పగుళ్ల ముప్పు పొంచి ఉంటుంది. జీవితం తొలినాళ్లలోనే.. ఎముకల బరువు పెరుగుతున్న దశలో టైప్ 1 డయాబెటిస్ తలెత్తుతుంటుంది. దీంతో ఎముకలు పూర్తి బరువు, బలాన్ని సంతరించుకున్నప్పటికీ టైప్ 1 డయాబెటిస్ రోగుల్లో అది క్షీణిస్తూ ఉండే అవకాశం ఉంది. కాగా, ఎముకల బరువు తక్కువగా ఉంటే తర్వాత కాలంలో ఎముకలు గుల్లబారే ఆస్టియోపొరోసిస్ రావచ్చు. నాడులు ధ్వంసం కావడం, కండరాల బలహీనత, చక్కెర తక్కువగా ఉండటం, దృష్టి సమస్యలకు తోడుగా ఎముకల పగుళ్లు రావడం, క్షీణించడం మొదలైన ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి, మహిళలు గుండె ఆరోగ్యానికి రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయులు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవాలి. కొందరు తమకు డయాబెటిస్ ఉన్న విషయం గుర్తించకపోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అందువల్ల, రక్తంలో చక్కెర స్థాయులు, శరీర బరువు, కొలెస్ట్రాల్ శాతం మొదలైన వివరాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.