Constipation | ప్రస్తుత కాలంలో మనల్ని ఇబ్బంది పెడుతున్న జీర్ణ సంబంధిత సమస్యల్లో మలబద్దకం సమస్య కూడా ఒకటి. ఇది ఒక సాధారణ సమస్య అయినప్పటికీ దీనిని నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మన దేశంలో దాదాపు 22 శాతం మంది మలబద్దకంతో బాధపడుతున్నారు. 13 శాతం మంది తీవ్రమైన మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఫైబర్ కలిగిన ఆహారాలను తక్కువగా తీసుకోవడం, నీటిని తక్కువగా తాగడం, శారీరక శ్రమ లేకపోవడం, జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి మందులను వాడుతూ ఉంటారు. అయితే తరచూ ఈ మందులను వాడడం అంత మంచి పద్దతి కాదు. మలబద్దకం సమస్యతో బాధపడే వారు మందులను వాడడానికి బదులుగా జీవనశైలిలో, ఆహార పద్దతుల్లో మార్పులు చేసుకోవాలి. మలబద్దకంతో బాధపడే వారు ముఖ్యంగా ఎండుద్రాక్షలను పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మలబద్దకాన్ని తగ్గించే సులభమైన, సహజమైన మార్గాలల్లో ఇది ఒకటి. దీని వల్ల మబద్దకం సమస్య తగ్గడంతో మొత్తం శరీరానికి కూడా మేలు కలుగుతుందని వారు తెలియజేస్తున్నారు. ఇక ఎండుద్రాక్షలను పెరుగుతో ఎలా తీసుకోవాలి.. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఇతర ప్రయోజనాల గురించి వైద్యులు వివరిస్తున్నారు.
ఎండుద్రాక్ష పెరుగును తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో తాజా గోరు వెచ్చని పాలను తీసుకోవాలి. తరువాత ఇందులో 4 లేదా 5 నల్ల ఎండుద్రాక్షలను వేయాలి. తరువాత ఇందులో తోడుకు సరిపోయేలా ఒక చుక్క పెరుగు వేసి బాగా కలపాలి. తరువాత మూత పెట్టి రాత్రంతా కదిలించకుండా ఉంచాలి. మరుసటి ఈ పాలు పెరుగుగా మారతాయి. ఇలా తయారు చేసిన ఎండుద్రాక్ష పెరుగును భోజనంతో పాటుగా తీసుకోవచ్చు లేదా స్నాక్ గా కూడా తీసుకోవచ్చు. పిల్లలకు కూడా ఈ పెరుగును ఆహారంగా ఇవ్వవచ్చు. ఇలా తయారు చేసిన ఎండుద్రాక్ష పెరుగును తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
ఎండుద్రాక్షలో కరిగే ఫైబర్ ఉంటుంది. పెరుగు ప్రోబయోటిక్ గా పని చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎండుద్రాక్షను, పెరుగును కలిపి తీసుకోవడం వల్ల పొట్టలో చెడు బ్యాక్టీరియా శాతం తగ్గుతుంది. మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. దీంతో ఇన్పెక్షన్ లు రాకుండా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. కడుపులో మంట సమస్యతో బాధపడే వారు ఇలా తయారు చేసిన పెరుగును తీసుకోవడం వల్ల పొట్టకు శాంతత లభిస్తుంది. కడుపులో మంట తగ్గుతుంది.
అంతేకాకుండా ఎండుద్రాక్ష, పెరుగును కలిపి తీసుకోవడం వల్ల దంతాల, చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకల దృఢంగా మారతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎండుద్రాక్ష పెరుగును తీసుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. పిల్లలకు ఈ పెరుగును ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఈ విధంగా ఎండుద్రాక్షలతో చేసిన పెరుగు మలబద్దకం సమస్యను తగ్గించడంతో పాటు మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని దీనిని తరచూ తీసుకోవడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.