Peanuts Vs Almonds | బాదంపప్పు, పల్లీల్లో అనేక అద్భుతమైన పోషకాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండింటిలోనూ ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. కనుక చాలా మంది స్నాక్స్ రూపంలో ఈ రెండింటినీ తింటుంటారు. బాదంపప్పును నానబెట్టి తింటారు. పల్లీలను నానబెట్టి లేదా వేయించుకుని తింటారు. అధిక బరువు తగ్గాలని చూసే వారు కూడా ఆరోగ్యవంతమైన స్నాక్స్‌లాగా ఈ రెండింటిని తింటుంటారు. ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. కనుక ఆరోగ్యపరంగా కూడా లాభాలు ఉంటాయి కాబట్టి చాలా మంది వీటిని స్నాక్స్ రూపంలో తింటుంటారు. అయితే బాదంపప్పు, పల్లీల్లో.. రెండింటిలో ఏవి మంచివి.. అని చాలా మందికి సందేహం వస్తుంది. దీనికి న్యూట్రిషనిస్టులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లీలు, బాదంపప్పులో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా ఈ రెండింటిలో బి విటమిన్లతోపాటు విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. రోజుకు గుప్పెడు బాదంపప్పులను తింటే మనకు రోజుకు కావల్సిన విటమిన్ ఇలో దాదాపుగా 45 శాతం వరకు లభిస్తుంది. కనుక విటమిన్ ఇ అధికంగా కావాలంటే బాదంపప్పును తినాల్సి ఉంటుంది. ఇక ప్రోటీన్ల విషయానికి వస్తే పల్లీలు, బాదంపప్పు రెండింటిలోనూ ప్రోటీన్లు అధికంగానే ఉంటాయి. బాదంపప్పులో అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అయితే ప్రోటీన్ల విషయానికి వస్తే బాదంపప్పు కన్నా పల్లీల్లోనే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల బాదంపప్పు ద్వారా 21 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. అదే 100 గ్రాముల పల్లీల ద్వారా 24.4 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. కనుక ప్రోటీన్ల కోసమే అయితే పల్లీలను తినవచ్చు.
ఇక శాచురేటెడ్ కొవ్వుల విషయానికి వస్తే పల్లీల్లో ఇవి ఎక్కువగా, బాదంపప్పులో తక్కువగా ఉంటాయి. పల్లీలతో పోల్చినప్పుడు శాచురేటెడ్ కొవ్వులు బాదంపప్పులో 51 శాతం మేర తక్కువగా ఉంటాయి. అయితే ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులే. కనుక బరువు తగ్గాలనుకునే వారు లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు పల్లీలకు బదులుగా బాదంపప్పును తింటే మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ఇక క్యాలరీల విషయానికి వస్తే ఈ రెండింటిలోనూ ఎక్కువగానే ఉంటాయి. పల్లీల్లో 100 గ్రాములకు 567 క్యాలరీలు లభిస్తాయి. బాదంపప్పు అయితే 100 గ్రాములకు 579 క్యాలరీలు లభిస్తాయి. అంటే రెండింటితోనూ దాదాపుగా సమానంగా శక్తి లభిస్తుందన్నమాట. కనుక శక్తిని కోరుకునేవారు పల్లీలు లేదా బాదంపప్పు వేటినైనా తినవచ్చు.
విటమిన్ల విషయానికి వస్తే పల్లీల్లో అధికంగా విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు బి1, బి3, బి5, బి6 లతోపాటు ఫోలేట్ కూడా పల్లీల్లో అధికంగా ఉంటుంది. బాదంపప్పులో విటమిన్ బి2, విటమిన్ ఇ, ఎ అధికంగా ఉంటాయి. అయితే ఈ రెండు రకాల నట్స్‌లోనూ మనకు విటమిన్లు సి, డి, కె, బి12 లభించవు. కానీ బి విటమిన్లను కావాలని అనుకునేవారు పల్లీలను తినడం మంచిది. అదే విటమిన్ ఇ, ఎ కోసం బాదంపప్పును తినడం మంచిది. అయితే రెండు రకాల నట్స్ మన ఆరోగ్యానికి మంచి చేస్తాయి. రెండూ దాదాపుగా సమానమైన లాభాలనే అందిస్తాయి. కానీ పైన చెప్పినట్లుగా కొన్ని ప్రత్యేక అవసరాల కోసం అయితే సూచించిన విధంగా ఈ రెండింటినీ తీసుకోవాలి. లేదా సాధారణంగా అయితే రెండింటిలో వేటిని తిన్నా లాభాలను పొందవచ్చు. కానీ వీటిని రోజుకు గుప్పెడు కన్నా ఎక్కువగా తినరాదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.