న్యూఢిల్లీ : రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శరీరంలో హానికారక పదార్ధాలు పోగుపడనీయకుండా ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పండ్లు ముఖ్యంగా ఆయా సీజన్లో లభించే పండ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుతాయని సూచిస్తున్నారు.
అలాంటి పండ్లలో యాపిల్ వండర్ ఫ్రూట్ అని వైద్య నిపుణులు తేల్చి చెప్పారు. గుండె ఆరోగ్యాన్ని క్రమబద్దీకరించడంలో రోజుకో యాపిల్ దివ్యౌషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు. రోజూ యాపిల్ తినడం లేదా యాపిల్ జ్యూస్ తాగడంతో చెడు కొలెస్ట్రాల్ ప్రభావం తగ్గుతుందన్నది వైద్య నిపుణుల మాట. రక్తనాళాలు, ధమనుల్లో వ్యర్ధాలు పేరుకుపోకుండా నియంత్రించే శక్తి యాపిల్స్‌కు ఉందని జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.
రోజుకు 12 ఔన్సుల యాపిల్ జ్యూస్ తీసుకుంటే గుండె పోటుకు దారితీసే రక్తనాళాల పూడికను నివారిస్తుందని అధ్యయన ప్రధాన పరిశోధకులు డైన్ హైసన్ తెలిపారు. చెడు కొలెస్ట్రాల్‌గా వ్యవహరించే ఎల్డీఎల్ ధమనుల్లో వ్యర్ధాలు పేరుకుపోయేలా చేస్తాయని, ఈ ఆక్సిడేషన్ను జాప్యం చేస్తే ఎల్డీఎల్ పార్టికల్స్‌ను బయటకు పంపే అవకాశం ఉంటుందని పరిశోధకులు తేల్చారు.