పల్లీలు పచ్చిగానో, ఉడికించో, వేయించో ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్లు తింటారు. కాస్త టైం పాస్‌కి బఠానీకి దోస్తీగా ఉండే వీటిని, నాలుగు అలా నోట్లో వేసుకు నమలడం చాలామందికి అలవాటు. అయితే ఈ వేరుశనగ గుళ్లను పొట్టుతో తినాలా లేదా తీసేసి తింటే మంచిదా అన్న సందేహం ఉంటుంది. దానికి ఆహార నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
పల్లీల్లో ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకర కొవ్వులు, ఫోలేట్, మెగ్నీషియంలాంటి పోషకాలెన్నో ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినివ్వడంతో పాటు కండరాల పెరుగుదలకు తోడ్పడతాయి. ఇక, ఒక రకమైన ఎరుపు రంగులో ఉండే దీని పొట్టులో అధిక మోతాదులో యాంటి ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇందులో ఉండే పాలీ ఫినాల్స్ శరీంలోని ఫ్రీరాడికల్స్‌ను అదుపు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో ఉండే డైటరీ ఫైబర్లు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసేందుకు, జీర్ణ సమస్యలను తగ్గించేందుకు తోడ్పడతాయి.
ఆహారం నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చేయడం ద్వారా, రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఒకేసారి పెరగకుండా తోడ్పడుతుంది ఈ పొట్టు. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటి ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అందులోనూ ఉడకబెట్టిన వాటితో పోలిస్తే వేయించిన వాటిలో ఈ పోషకాలు ఎక్కువగా నిల్వ ఉంటాయి. ఇక, కొంతమందికి ఇవి పడకపోవచ్చు. అరుగుదల సమస్యలకు దారితీయొచ్చు. అలాంటి వాళ్లు పల్లీలు తినకపోవడమే మంచిది.