హలో మేడమ్. కొంత మందికి కాస్త పులుపు తిన్నా, కొంచెం వేళ తప్పి భోంచేసినా ఎసిడిటీ వస్తుంది. మాటిమాటికీ వీళ్లు మాత్రలు మింగుతూ ఉండాల్సిన పరిస్థితి! ఇలా టాబ్లెట్లను ఆశ్రయించకుండా రోజువారీ ఆహారంలో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా ఎసిడిటీని నియంత్రించే అవకాశం ఉందా. అలా ఉంటే ఏం తినాలో చెప్పగలరు.
జీర్ణాశయంలోని ఆమ్లాలు అన్నవాహికలోకి ఎదురు రావడం వల్ల తేన్పులు, గుండె మంట, కడుపు ఉబ్బరంలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇది తరచూ జరిగితే ‘గ్యాస్ట్రో సాఫజీల్ రిఫ్లెక్ట్ డిసీజ్’ కింద లెక్కవేయాలి. దీన్నే గ్యాస్ ప్రాబ్లం అనీ అంటుంటాం. త్వరగా జీర్ణమయ్యేవి, అలాగే పీచులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఈ సమస్యను నియంత్రించడానికి బాగా సాయపడతాయి. ఈ కోవలోకి పండ్లు వస్తాయి. ఎందుకంటే ఎక్కువ శాతం నీరు, పీచులు ఉండే పండ్లు త్వరగా జీర్ణాశయం నుంచి బయటికి వెళతాయి. ఓట్మీల్, బ్రౌన్రైస్లోనూ అధిక ఫైబర్ ఉంటుంది. ఓట్స్‌లోని జిగురుగా ఉండే పదార్థం అన్నవాహికలో ఆమ్లాలు వెనక్కు తన్నకుండా అడ్డుపడుతుంది. పెరుగు, మజ్జిగ, వెన్న తీసిన పాలలాంటి తక్కువ కొవ్వులుండే పాల పదార్థాలు జీర్ణాశయానికి పూతలా పనికొస్తాయి.
వీటి పీహెచ్ స్థాయులు తక్కువగా ఉండటం వల్ల ఇవి పొట్టలోని ఆమ్లాలను క్రమబద్ధీకరిస్తాయి. అల్లానికి కూడా జీర్ణవ్యవస్థకు సాంత్వన చేకూర్చే స్వభావం ఉంటుంది. వేడి నీళ్లలో అల్లం ముక్కలు వేసి తాగితే తేన్పులు, గుండె మంటలాంటివి తగ్గుతాయి. పడుకునేందుకు మూడు గంటల ముందే భోజనం పూర్తి చేయాలి. మద్యం, సిగరెట్‌లాంటి అలవాట్లను మానుకోవాలి. పొట్ట దగ్గర మరీ బిగుతుగా ఉండే దుస్తుల్ని ధరించకపోవడం కూడా కొంత వరకూ ఈ సమస్యను తగ్గించేందుకు దోహదం చేస్తుంది. సమతులాహారం, ఎత్తుకు తగ్గ బరువు, సరైన నిద్ర కూడా ఎసిడిటీని నియంత్రిస్తాయి. ఇవన్నీ పాటిస్తే ఎసిడిటీ మాత్రలను దాదాపు పక్కన పెట్టేయొచ్చు. అయినా ఇబ్బంది తగ్గకపోతే మాత్రం, డాక్టర్‌ను సంప్రదించాల్సిందే!
– మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్ Mayuri.trudiet@ gmail.com