Anemia in Men | పురుషుల్లో రక్తహీనత (ఎనీమియా) ఉండదని అంతా అనుకుంటారు. నిజానికి ఇది పూర్తిగా తప్పు. రక్తహీనత గురించి మాట్లాడినప్పుడల్లా మన దృష్టంతా మహిళలపైనే ఉంటుంది. రక్తహీనత పురుషుల్లో కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. రక్తహీనత కారణంగా పురుషుల్లో సంతానోత్పత్తి కూడా తీవ్రంగా ప్రభావితమవుతుంది. సంతానలేమి సమస్యలు వస్తాయి. ఆడవారిలో మాదిరిగా మగవారిలో పీరియడ్స్ ఉండవు. అయినప్పటికీ మగవారిలో ఎనిమియా కనిపిస్తుంది. ఐరన్ లోపం వల్ల వృషణాల కణజాలం దెబ్బతింటుందని ఎపిడెమియాలజిస్టులు చెప్తున్నారు. వృషణాల కణాలలో ఉండే ఫెర్రిటిన్ అనేది స్పెర్మ్ తయారు చేస్తుంది. ఐరన్ లోపం కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గడం మొదలవుతుంది. యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్‌లు కూడా తగ్గడం ప్రారంభించి స్పెర్మ్ సరిగ్గా అభివృద్ధి చెందదు.
భారత దేశంలోని గ్రామాలలో ప్రతి 10 మంది పురుషుల్లో ముగ్గురికి రక్తహీనత ఉన్నది. పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధన పీఎల్ఓఎస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో కూడా ప్రచురితమైంది. ఈ పరిశోధనలో 15 నుంచి 54 ఏండ్ల వయస్సు గల 61 వేల మంది పురుషులను తీసుకుని వారి శరీరంలో తక్కువ హిమోగ్లోబిన్‌ను కనుగొన్నారు. మహిళల మాదిరిగానే ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవాలని పరిశోధకులు వారికి సలహా ఇచ్చారు.
ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన నివేదికను పీఎల్ఓఎస్ ధ్రువీకరించింది. అధిక బరువు ఉన్న పురుషుల కంటే తక్కువ బరువు ఉన్న పురుషులు రక్తహీనతకు గురయ్యే అవకాశం ఉన్నదని పరిశోధకుడు సుమిత్ రామ్ తెలిపారు. తక్కువ బరువు ఉన్న పురుషులలో 34.7 శాతం రక్తహీనత కలిగి ఉండగా, అధిక బరువు ఉన్న పురుషుల్లో 19.3 శాతం మాత్రమే రక్తహీనతతో ఉన్నారు. వృద్ధులు కూడా రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. మద్యం, సిగరెట్లు తాగే పురుషుల్లో రక్తహీనత లక్షణాలు ఎక్కువగా కనిపించాయి.
ఆల్కహాలిజం హెమటోలాజికల్ కాంప్లికేషన్స్‌లో ఆల్కహాల్ శరీరంలోని వివిధ రకాల రక్త కణాలను, వాటి పనితీరును ప్రభావితం చేస్తుందని హెరాల్డ్ ఎస్ బల్లార్డ్ చెప్పా. అతిగా మద్యం తాగే వారిలో రక్తకణాల ఉత్పత్తి తగ్గడమే కాకుండా కొత్తగా ఏర్పడే రక్తకణాలు కూడా అసాధారణంగా ఉంటాయని గుర్తించారు.
90 శాతం రక్తహీనత కేసులకు ఐరన్ లోపం ప్రధాన కారణం. ఇదే సమయంలో 10 శాతం కేసుల్లో ఫోలేట్, విటమిన్ బీ12, విటమిన్ ఏ లోపం కారణంగా ఉంటున్నదని పరిశోధకులు చెప్తున్నారు. మహిళల్లో పీరియడ్స్ కారణంగా ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఈ కారణంగానే వారిలో రక్తహీనత ఏర్పడుతుంది. అయితే, పురుషుల్లో కడుపులో పురుగులు ఉండటం, మద్యం సేవించడం లేదా సిగరెట్ స్మోకింగ్ వల్ల రక్తహీనత ఏర్పడుతుందని తేల్చారు. కడుపులో టేప్‌వార్మ్, పిన్‌వార్మ్, హుక్వార్మ్ వంటి అనేక రకాల పురుగులు ఉన్నాయి. ఒక పురుగు ఒక్క రోజులో 0.1-0.4 మి.లీ రక్తాన్ని పీలుస్తుంది. ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పురుగులు రోజులో 250 మి.లీ రక్తాన్ని పీలుస్తాయి. ఫలితంగా రక్తం తగ్గిపోయి ఎనిమియా సంభవిస్తుంది.