మెనోపాజ్ దశ.. మహిళల జీవితాన్ని మరో మలుపు తిప్పుతుంది. ఈ సమయంలో.. వారి శక్తి క్రమక్రమంగా క్షీణిస్తుంది. అయితే.. మెనోపాజ్ కారణంగా తలెత్తే కొన్ని శారీరక సమస్యలను క్రమం తప్పని వ్యాయామం తగ్గించగలదని తాజా సర్వే ఒకటి కనుగొన్నది. ఇంగ్లాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్ నిర్వహించిన అధ్యయనం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సర్వేలో 70 మందికిపైగా పాల్గొన్నారు. వీరిలో కొందరు మామూలు వ్యాయామం చేస్తే.. మరికొందరు ఎక్కువ ప్రభావం చూపించే రెసిస్టెన్స్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌ను పూర్తిచేశారు. అయితే, మామూలు వ్యాయామ దినచర్యతో పోలిస్తే.. రెసిస్టెన్స్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నవారిలో అనేక మార్పులు గమనించినట్టు పరిశోధకులు చెబుతున్నారు.
రెసిస్టెన్స్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న వారిలో.. 19 శాతం మందిలో తుంటి పనితీరు మెరుగుపడిందట. వారి బాడీ ఫ్లెక్సిబిలిటీలోనూ 21 శాతం పెరుగుదల కనిపించిందట. ఇక డైనమిక్ బ్యాలెన్స్, మొబిలిటీ, స్థిరత్వంలోనూ 10 శాతం పెరుగుదల నమోదైందని సర్వేలో తేలింది. మెనోపాజ్‌కు ముందు, ఆ సమయంతోపాటు ఆ తర్వాత కూడా మహిళలు తరచుగా కండరాల బలం కోల్పోతారనీ, వారి సమతుల్యతలో క్షీణత కనిపిస్తుందని పరిశోధకులు చెప్పారు.
ఫలితంగా కింద పడిపోయినా.. ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తుంటికి సంబంధించిన ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే.. మహిళలు ముందునుంచే తమ ఎముకల బలాన్ని, సామర్థ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. కండరాల ద్రవ్యరాశిని పెంచుకోవడం వల్ల మెనోపాజ్ దశలో శక్తిని కోల్పోకుండా ఉంటారని వెల్లడించారు.