Sleeplessness | నిద్ర సరిగా లేకపోవడం రోజువారీ జీవనశైలిపై మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నవారు మెగ్నిషియం, మెలటోనిన్ వంటి సప్లిమెంట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ రెండూ ఒకే విధంగా పనిచేయవు. నిద్ర సమస్యకు కారణం శరీరంలో ఉన్న లోపాలు, నిద్ర సమయం వంటి అంశాలను బట్టి వీటి ప్రయోజనం మారుతుంది. శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నిషియం ఒకటి. ఇది 300కు పైగా జీవరసాయన ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా నాడీ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేయడంతోపాటు, నిద్ర, విశ్రాంతికి సహాయపడే గాబా (GABA) అనే న్యూరోట్రాన్స్మిటర్ నియంత్రణలోనూ భాగస్వామ్యం వహిస్తుంది.
శరీరంలో మెగ్నిషియం స్థాయిలు తక్కువగా ఉన్నవారికి దీని సప్లిమెంటేషన్ కొంత ప్రయోజనం కలిగిస్తుంది. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ నిద్ర సమస్యలు ఎదుర్కొనే వృద్ధులు, ఒత్తిడి కారణంగా నిద్ర సరిగా పట్టని వారు మెగ్నిషియం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఇది కండరాల ఒత్తిడిని, శరీరంలోని టెన్షన్‌ను తగ్గించి విశ్రాంతికి సహాయపడుతుంది. మరోవైపు, మెలటోనిన్ అనేది మెదడు సహజంగా ఉత్పత్తి చేసే హార్మోన్. సాధారణంగా నిద్రపోయే సమయం దగ్గరపడినప్పుడు దీని ఉత్పత్తి పెరుగుతుంది. శరీరంలోని అంతర్గత జీవ గడియారాన్ని నియంత్రించడంలో మెలటోనిన్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి నిద్ర సమయం వచ్చిందనే సంకేతాన్ని అందించడం ద్వారా నిద్రలోకి వెళ్లేందుకు సహాయపడుతుంది. జెట్ లాగ్ కారణంగా నిద్ర సమయం మారిపోయినవారికి మెలటోనిన్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే షిఫ్ట్ ఉద్యోగులు, నిద్ర సమయం ఆలస్యంగా మారిపోయినవారు, శరీరంలోని సహజ నిద్ర-మెళకువ చక్రంలో మార్పులు వచ్చినవారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
మెగ్నిషియం, మెలటోనిన్ రెండూ నిద్రకు సహాయపడినా వాటి పనితీరు భిన్నంగా ఉంటుంది. మెగ్నిషియం ప్రధానంగా శరీరం, కండరాలు విశ్రాంతి పొందేందుకు, నాడీ వ్యవస్థలోని కొన్ని ప్రక్రియలను నియంత్రించేందుకు సహాయపడుతుంది. మెలటోనిన్ మాత్రం శరీరానికి నిద్రపోయే సమయం వచ్చిందనే సంకేతాన్ని అందించడం ద్వారా నిద్ర చక్రాన్ని సరిచేయడంలో సహాయపడుతుంది. నిద్రపట్టకపోవడానికి ప్రధాన కారణం శరీరం లేదా మనసు రిలాక్స్ కాకపోవడం అయితే మెగ్నిషియం కొంత ఉపయోగపడుతుంది. నిద్ర సమయం పూర్తిగా మారిపోవడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వంటి సమస్యలు ఉంటే మెలటోనిన్ మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. మెలటోనిన్ సాధారణంగా మెగ్నిషియంతో పోలిస్తే వేగంగా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మెగ్నిషియం, మెలటోనిన్ రెండింటినీ కలిపి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, వైద్య నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. సొంతంగా అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అవాంఛిత దుష్ప్రభావాలు కలిగిస్తుంది. మెగ్నిషియంను అధిక మోతాదులో తీసుకుంటే విరేచనాలు, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. కొన్ని మందులతో ఇది పరస్పర చర్యలకు కూడా కారణం అవుతుంది. మెలటోనిన్‌ను అధికంగా లేదా వైద్యుల సూచన లేకుండా తీసుకుంటే పగటిపూట మగత, తల తిరగడం, తలనొప్పి, ఎక్కువగా లేదా స్పష్టంగా కలలు రావడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి.
గర్భిణులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ప్రిస్క్రిప్షన్ మందులు వాడుతున్నవారు, పిల్లలు వైద్యుల సలహా లేకుండా మెగ్నిషియం లేదా మెలటోనిన్ సప్లిమెంట్లు తీసుకోకపోవడం మంచిది. శరీరంలో ఏదైనా పోషక లోపం ఉందా లేదా తెలుసుకోవడానికి అవసరమైతే రక్త పరీక్షలు చేయించుకోవడం కూడా మంచిది. అయితే మంచి నిద్ర కోసం సప్లిమెంట్లపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, నిద్రకు ముందు స్క్రీన్ వినియోగాన్ని తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కెఫీన్ తీసుకునే పరిమాణాన్ని నియంత్రించడం వంటి జీవనశైలి మార్పులు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను పాటించడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మెగ్నిషియం, మెలటోనిన్ రెండూ నిద్రకు కొన్ని సందర్భాల్లో సహాయపడే సప్లిమెంట్లే అయినప్పటికీ, ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా పనిచేస్తాయని చెప్పలేమని వారు తెలియజేస్తున్నారు. నిద్ర సమస్యకు అసలు కారణాన్ని గుర్తించి, అవసరమైనప్పుడు నిపుణుల సలహాతో వీటిని ఉపయోగించడం సురక్షితమైన మార్గం. ముఖ్యంగా సరైన నిద్ర సమయాన్ని పాటించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి మొదటి అడుగుగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు.