నమస్తే డాక్టర్. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉందంటారు. అసలు వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఏమిటి?
వ్యక్తిగత పరిశుభ్రత అనేది రెండు పూటలా పళ్లు తోము కోవడం నుంచే ప్రారంభమవుతుంది. మహిళల విషయానికొస్తే.. వ్యక్తిగత భాగాలకు సంబంధించిన శుభ్రతను పాటించడం అన్నది ఇన్ఫెక్షన్లను దూరం పెట్టేందుకు ఎంతగానో సాయపడుతుంది. శుభ్రత పేరుతో కొంతమంది యోని లోపలి భాగాన్ని కూడా కడుగుతూ ఉంటారు.
నిజానికి, మన శరీరమే ఆ ప్రాంతాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచుతుంది. అక్కడి పీహెచ్ స్థాయులు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. అవి ఉత్పత్తి చేసే ఒక రకం చక్కెరలు (ైగ్లెకోజెన్లు) కూడా ఆ భాగానికి మేలు చేస్తాయి. కానీ ఇలా కడగడం వల్ల ఆ ప్రాంతం క్షార స్వభావాన్ని సంతరించుకుంటుంది.
ఫలితంగా ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. నిజానికి, వ్యక్తిగత భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని అంతే మృదువుగా శుభ్రం చేయాలి. అలాగే, మలవిసర్జన తర్వాత ముందు నుంచి వెనుకకు నీళ్లతో శుభ్రపరచుకోవాలి. అండర్వేర్లను రోజుకు రెండుసార్లు మార్చుకోవాలి. రాత్రిపూట అసలు వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే యోని ప్రాంతం తడిగా ఉంటుంది. రాత్రిపూట అయినా గాలి ఆడితే, ఇన్ఫెక్షన్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇటీవల వెస్ట్రన్ టాయిలెట్లు ఎక్కువగా వాడుతున్నారు.
అలాంటప్పుడు దాని నిర్వహణ గురించి కూడా తెలుసుకోవాలి. ఆ టాయిలెట్ వాడాక.. టిష్యూతో కమోడ్ సీట్‌ను శుభ్రంగా తుడవాలి. అది నేరుగా మన శరీరానికి తగులుతుంది కాబట్టి, కొన్ని సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. శుభ్రతపరంగా ఇండియన్ టాయిలెట్స్ అన్నివిధాలా మేలని అధ్యయనాలు నిరూపించాయి.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్