మన శరీరంలోని అతి ప్రధానమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఇవి మన శరీరంలో రక్తాన్ని శుద్ధిచేసి, మలిన పదార్థాలను మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి. నీటి సమతుల్యతను కాపాడటంతోపాటు రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. ఎర్ర రక్తకణాల తయారీలోనూ కిడ్నీలది ముఖ్యపాత్రే. ఎముకల పటిష్ఠతను కాపాడుతాయి. ఇవి చెడిపోతే శరీరంలో రక్తశుద్ధి ప్రక్రియ కుంటుపడిపోయి రక్తం కలుషితమవుతుంది. దీంతో మనిషి మనుగడకే ప్రమాదం ఏర్పడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రోగి సాధారణ జీవితానికి కిడ్నీ మార్పిడి ఒక్కటే శాశ్వత పరిష్కారం.
మూత్రపిండాలను కబళించే జబ్బుల్లో మూలమైనది మధుమేహం. దీర్ఘకాల అధిక రక్తపోటు కూడా కిడ్నీలను దెబ్బతీస్తుంది. మూత్రపిండాలు పాడైపోయిన వారికి మూత్రం ద్వారా ప్రొటీన్ ఎక్కువగా బయటికి వెళ్లిపోతుంది. డయాబెటిస్ మాత్రమే కాకుండా జన్యుపరమైన కారణాలతోపాటు మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయడం, మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారిలోనూ కిడ్నీల సమస్య తలెత్తడానికి ఆస్కారం ఉంది. కాగా, వంశపారంపర్యంగా వచ్చే మూత్రపిండాల సమస్యలు కూడా 2 నుంచి 5 శాతం వరకు కిడ్నీల సమస్యలకు దోహదం చేస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
దీర్ఘకాలిక కిడ్నీల వైఫల్యం ఉన్నవాళ్లు సంబంధిత వైద్యులను తరచుగా సంప్రదిస్తూ ఉండాలి. వాళ్ల సూచనలను తు.చ. తప్పకుండా పాటించాలి. ఒకవేళ రక్తపోటు సమస్య (బీపీ) ఉంటే దాన్ని అదుపులో పెట్టుకోవాలి. నాణ్యమైన పోషకాహారం తీసుకోవాలి. ఇక మూత్రపిండాలు వాటి సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతే మాత్రం శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ కుంటుపడుతుంది. కాబట్టి, రక్తం శుద్ధి చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాల్సి వస్తుంది. ఇలాంటి రోగులకు డయాలసిస్ లేదా మూత్రపిండాల మార్పిడి అవసరం పడుతుంది.
రోగికి విడువకుండా వాంతులు కావడం, నీరసం, ఆకలి మందగించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు డయాలసిస్ అవసరమని నిర్ధారించుకోవాలి. అయితే, కొంతమంది రోగుల్లో ఇలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఇలాంటివారికి నిర్వహించే పరీక్షల్లో సీరం క్రియాటినైన్ 8 ఎంజీకి, యూరియా 150 ఎంజీకంటే ఎక్కువగా నిర్ధారణ అయితే రోగి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారకుండా డయాలసిస్ అత్యవసరం అవుతుంది. కానీ, వైద్యుల సూచనలు, సలహాల మేరకే ఈ ప్రక్రియను చేపట్టాలి.
యంత్రం ద్వారా రక్తాన్ని శుద్ధి చేసే పద్ధతిని హీమో డయాలసిస్ అంటారు. ఈ ప్రక్రియలో కృత్రిమ కిడ్నీని వాడి రక్త శుద్ధి చేస్తారు. దీనికోసం తప్పనిసరిగా వారానికి మూడుసార్లు.. రోజు విడిచి రోజు డయాలసిస్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక డయాలసిస్ చేయడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. అంతేకాదు, ఇంట్లోనే చేసుకోగలిగే డయాలసిస్ పద్ధతి కూడా అందుబాటులో ఉంది. దీన్ని పెరిటోనియల్ డయాలసిస్ అని పిలుస్తారు.
ఈ ప్రక్రియలో కడుపులో ఉండే పెరిటోనియం అనే సన్నటి జల్లెడ లాంటి పొరకు మెత్తని ట్యూబ్‌ను చిన్నతోక ద్వారా అమరుస్తారు. ఈ గొట్టం ద్వారా ప్రత్యేకంగా తయారుచేసిన బ్యాగులోని ప్లూయిడ్స్‌ను కడుపులోకి పంపిస్తారు. రక్త శుద్ధి ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ పరికరాలను తీసేస్తారు. ఇలా రోజుకు అరగంట చొప్పున మూడు నుంచి నాలుగుసార్లు డయాలసిస్ చేసుకోవాలి.
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది అందరికి సాధ్యపడదు. దీనికి దాత అవసరం అవుతారు. దాత దొరికేవరకు రోగి కొన్నాళ్లపాటు లేదా తన జీవితాంతం డయాలసిస్ మీదే ఆధారపడాల్సి ఉంటుంది. కిడ్నీ వైఫల్యం ఉన్న రోగుల్లో డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ దాదాపు 25 శాతం మంది వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మృత్యువాత పడుతున్నారు. డయాలసిస్‌లో ఉన్నప్పుడు రోగి గుండె వైఫల్యం చెందడం, లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్కు గురవడం లాంటి కారణాల వల్ల ప్రాణాలను కోల్పోతున్నారు. అందుకే, దీర్ఘకాల కిడ్నీ వైఫల్యం ఉన్నవారికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు మించిన ప్రత్యామ్నాయం లేదని చెప్పవచ్చు.
రోగికి మూత్రపిండాలు అవసరమైనప్పుడు రెండు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి.. బతికి ఉన్నవారి (లైవ్ డోనార్) నుంచి కిడ్నీ సేకరించడం, రెండోది చనిపోయిన వారి (డిసీజ్డ్ డోనార్) నుంచి కిడ్నీ సేకరించడం. లైవ్ డోనార్లో కేవలం రక్త సంబంధీకుల నుంచి మాత్రమే కిడ్నీ సేకరించాల్సి ఉంటుంది. అలానే రోగి బ్లడ్ గ్రూప్ దాత బ్లడ్ గ్రూప్‌తో కలవాల్సి ఉంటుంది. ఇక కిడ్నీ దాతలకు అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండెజబ్బులు, మెదడు జబ్బులు, కాలేయ వ్యాధులైన హెపటైటిస్ బి, సి లాంటివి ఉండకూడదు.
ఒకవేళ రక్త సంబంధీకుల బ్లడ్ గ్రూప్ కలవకపోతే స్వాప్ రీనల్ లేదా ఏబీఓ ఇన్‌కంపాటిబుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే ఇలాంటి సందర్భాల్లో ఇదే సమస్యతో బాధపడుతున్న మరొకరికి వారి రక్త సంబంధీకులు కిడ్నీ దానం చేయాలని అనుకుంటే, సరిపోతాయనుకుంటే ఒకరి దాతలు మరొకరికి పరస్పరం కిడ్నీలు దానం చేసే ప్రక్రియనే ‘స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (ఇచ్చిపుచ్చుకోవడం)’ అంటారు. ఈ విధానంలో ఒక రోగి బంధువు కిడ్నీ మరొక దాత బంధువుకు, అక్కడి దాత కిడ్నీ ఇక్కడి రోగికి అమరుస్తారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వైద్యుల్లో పెరుగుతున్న నైపుణ్యాలు ప్రస్తుతం బ్లడ్ గ్రూప్‌లు కలవకపోయినా కూడా కిడ్నీ మార్పిడికి అవకాశం కల్పిస్తున్నాయి. ఏబీఓ ఇన్‌కంపాటిబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే అత్యాధునిక వైద్య ప్రక్రియ ద్వారా దాత, స్వీకర్తలు వేర్వేరు బ్లడ్ గ్రూప్‌లు కలిగి ఉన్నా కిడ్నీ మార్పిడికి వీలవుతుంది. ఈ ప్రక్రియలో ప్రత్యేకమైన ప్లాస్మా ఫేరసిస్ పద్ధతిని అనుసరించి వేర్వేరు బ్లడ్ గ్రూపుల్లోని యాంటిజెన్‌ను కలిసేలా చేస్తారు. దాత, స్వీకర్తల బ్లడ్ గ్రూప్‌లు కలవకపోయినప్పటికీ ఏబీఓ ఇన్‌కంపాటిబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానంలో కూడా ఫలితాలు కంపాటిబుల్ కిడ్నీ మార్పిడి మాదిరిగానే మెరుగ్గా ఉంటున్నాయి.
కిడ్నీ దానం హానికరం కానేకాదు. ఒక కిడ్నీ దానం ఇచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరో కిడ్నీతో కూడా జీవితకాలాన్ని హాయిగా కొనసాగించవచ్చు. దైనందిన జీవితానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. యథావిధిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు. డ్రైవింగ్, వ్యాయామం, ఆటలు, మిలిటరీ ఉద్యోగాలు కూడా నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. కిడ్నీ దాతకు భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీకి అత్యాధునికమైన ‘లాప్రోస్కోపిక్’ వైద్య విధానం అవలంబిస్తారు. పైగా డాక్టర్లు కూడా కిడ్నీ దానం చేయడం వల్ల దాతకు ఎలాంటి నష్టం లేదని నిర్ధారించిన తర్వాతే మార్పిడికి మొగ్గుచూపుతారు.
సర్జరీ అనంతరం వైద్యుల సూచనల మేరకే దాత కొన్ని ఆరోగ్య సూత్రాలను విధిగా పాటించాల్సి ఉంటుంది. రోజువారీ పనుల్లో వెంటనే పాల్గొనకూడదు. వైద్యులు నిర్దేశించిన దానికంటే ఎక్కువ బరువులు మోయకూడదు. ఇలా నాలుగు వారాలుపాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి రెండువారాలు కొంచెం నీరసంగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఎక్కువసేపు నిద్రపోవాలి లేదా రిలాక్స్ కావాలి. సాయంత్రాల్లో వాకింగ్ చేయడం ద్వారా కూడా మంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే సర్జరీ నిర్వహించిన భాగంలో కొంచెం వాపు లేదా నొప్పి కలగవచ్చు. కాబట్టి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.
కొందరు కేవలం ఆరు వారాలకే కోలుకుని తమ దైనందిన జీవితంలో బిజీ అయిపోతారు. మరికొంతమంది కోలుకోవడానికి మాత్రం ఇంకో రెండు మూడు వారాలు లేదంటే ఇంకొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు. శరీరం తత్వాన్ని బట్టి కోలుకోవడం ఆధారపడి ఉంటుంది. ఒకసారి కోలుకున్న తర్వాత ఇక కిడ్నీ మార్పిడికి చెందిన సమస్యలేమీ రావు. కాకపోతే మొదట్లోలాగా వారానికి, నెలకు కాకుండా ఏడాదికోసారి వైద్యులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు నడుచుకోవాలి.
కిడ్నీ మార్పిడి తర్వాత రోగి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల సూచనలను కచ్చితంగా పాటించాలి. రోగి ఇమ్యూనిటీ వ్యవస్థ ఇతరుల (దాత) అవయవాన్ని స్వీకరించడానికి వెంటనే సిద్ధపడదు. దీనికి చాలా సమయం పడుతుంది. కాబట్టి, సర్జరీ అనంతరం కొన్ని ప్రత్యేకమైన మందులు ఇవ్వడం ద్వారా రోగి ఇమ్యూనిటీ వ్యవస్థ అమర్చిన అవయవాన్ని శరీరం స్వీకరించేలా ‘ఇమ్యూనోసప్రెసెంట్స్’ మందులను రోజూ ఇస్తూ ఉంటారు.
అలా కిడ్నీ పనితీరును ఎప్పటికప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన డాక్టర్ల బృందం క్షుణ్నంగా అధ్యయనం చేస్తూ ఉంటుంది. దవాఖాన నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కూడా రోగి మూడు నెలలపాటు వైద్యులను సంప్రదిస్తూనే ఉండాలి. ఆ తర్వాత రోగి పరిస్థితి మెరుగుపడుతున్న కొద్దీ డాక్టర్ల పర్యవేక్షణ అవసరం ఉండదు. అయినప్పటికీ వారి సూచనలను మాత్రం విధిగా పాటిస్తూనే ఉండాలి.
– డాక్టర్. గుత్తా శ్రీనివాస్ సీనియర్ యూరాలజిస్ట్ & కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్