Kidney Stones | ‘కిడ్నీల్లో రాళ్లు’.. ఈ సమస్య వినని వాళ్లుండరు. పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతలతో ఈ సమస్యను ఇంకా ఎక్కువసార్లు వినాల్సి రావొచ్చు. ఒకవేళ అనుభవమూ కావొచ్చు. ఇందులో ఆశ్చర్యపోయేదేమీ లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రత, మారుతున్న జీవన శైలి కిడ్నీలను ప్రమాదంలోకి నెడుతున్నాయి. వాతావరణ మార్పులను మానవ మాత్రులు మార్చలేరు కాబట్టి. మనవంతు ప్రయత్నంగా ముందు జాగ్రత్తే మేలంటున్నారు యూరాలజిస్ట్ డాక్టర్. నందకుమార్ మధేకర్. వేడి వాతావరణంలో పనిచేసేవాళ్లు తమను తాము కాపాడుకునేందుకు చల్లని కబురు చెబుతున్నారు.
పొడిగా, వేడిగా ఉండే వాతావరణంలో నివసించే వారిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఇతర ప్రాంతాల వారికంటే ఎక్కువగా ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే అయిదు నుంచి ఏడు డిగ్రీలు అధికంగా ఉన్నట్లయితే.. ఆ ప్రాంతంలో ఉండేవాళ్లలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్యలు 30 శాతం పైగా ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ ఉష్ణోగ్రత మధ్యస్థంగా (35 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత) ఉండే ప్రదేశం నుంచి వేడి ప్రదేశానికి (35 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత) వలసవెళ్లి జీవించే వారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి.
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి భౌగోళిక పరిస్థితులకు సంబంధం స్పష్టమవుతున్నది. గ్రామీణ, పట్టణాలలో ఆరుబయట, అధిక వేడి వాతావరణంలో చాలామంది పనిచేస్తుంటారు. కొంతమంది వృత్తి, ఉద్యోగ పనుల్లో పడి నీళ్లు తాగడం నిర్లక్ష్యం చేస్తుంటారు. కొన్ని పని ప్రదేశాల్లో నీళ్లు తాగేందుకు సరైన అవకాశం ఉండదు. టాయ్లెట్లు అందుబాటులో లేనప్పుడు, దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మూత్రం రాకుండా ఉండేందుకు మహిళలు నీళ్లు తాగకుండా ఉంటారు. ఇటువంటి వారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
శరీరంలో నీటి పరిమాణం తగ్గడం (డీహైడ్రేషన్) వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరం నుంచి నీరు చెమట రూపంలో బయటికి పోతుంది. తగినన్ని నీళ్లు తాగితే శరీరం కోల్పోయిన నీరు భర్తీ అవుతుంది. దాహాన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్‌కు గురవుతారు. శరీరంలో నీరు తక్కువైతే మూత్రం చిక్కబడి ఆమ్ల (యాసిడ్) రూపానికి మారుతుంది. శరీరధర్మ క్రియల తర్వాత వెలువడిన సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్, ఆక్సలేట్స్, యూరిక్ ఆసిడ్ లాంటివి మూత్రపిండాలకు చేరుకుంటాయి. శరీర ద్రవాలు, మూత్రం చిక్కబడటం వల్ల ఇవి కిడ్నీలలో ఉండిపోతాయి.
కొంతకాలానికి ఇవి గట్టిపడి స్ఫటికాలుగా మారతాయి. ఇవి క్రమంగా ఒక్కచోటచేరి చిన్న రాళ్లుగా రూపొందుతాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడిన విషయం చాలాకాలం పాటు వ్యక్తి ఎరుకలోకి రాకపోవచ్చు. ఆ రాళ్లు మూత్రపిండాల నుంచి యురేటర్ (మూత్రపిండాలను, మూత్రాశయాన్ని కలిపే నాళం)లోకి జారి మూత్రాన్ని అడ్డుకున్నప్పుడో, ఆ నాళంలో ఇరుక్కొని నొప్పి కలిగినప్పుడో సమస్య ఉందని తెలుస్తుంది. ఇదే సమయంలో వీపులో, పొట్టలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, మూత్రం విసర్జించేప్పుడు నొప్పి తలెత్తడం లాంటి లక్షణాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడ్డాయనేందుకు సూచనలుగా చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు మూత్రంలో రక్తం పడుతుంది. కడుపులో తిప్పడం, వాంతులు కూడా అవుతాయి.
మూత్రనాళపు ఇన్ఫెక్షన్ని ప్రారంభంలోనే గుర్తిస్తే ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకు ప్రమాదకరంగా పరిణమించకుండా చేయవచ్చు. కొన్ని స్పష్టమైన లక్షణాల ఆధారంగా యూటీఐ ఇన్ఫెక్షన్ని తేలిగ్గా గుర్తించవచ్చు.
యూటీఐ ఇన్ఫెక్షన్ సోకినట్లు అనుమానం ఉంటే డాక్టరును సంప్రదించాలి. వ్యాధి నిర్ధారణ అయితే.. వెంటనే చికిత్స చేస్తే యూటీఐ ఇన్ఫెక్షన్, కిడ్నీల్లో రాళ్ల సమస్య తొందరగా అదుపులోకి వస్తాయి. సత్వర చికిత్సతో కిడ్నీలకు ప్రమాదం తప్పుతుంది.
ఈ లక్షణాలు కనిపించనపుడు ఎక్స్ రే, యూరిన్, సి.టి.స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించి మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నదీ లేనిది నిర్ధారించవచ్చు. రాళ్లు చిన్నవిగా ఉంటే బయటికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కలిగే బాధ నివారణకు మందులు ఇస్తారు. మందులతోపాటు సమృద్ధిగా (రోజుకు కనీసం 3-4 లీటర్ల) నీళ్లు తాగాలి. ఆ విధంగా చేయటం వల్ల మూత్రంతో రాళ్లు బయటికి వెళ్లిపోతాయి. 5 మిల్లీమీటర్లు అంతకన్నా చిన్నవిగా ఉన్న రాళ్లు ఈ విధంగా మూత్రంతోపాటు వెళ్లిపోగలుగుతాయి. అంతకంటే పెద్దవిగా ఉండే రాళ్లను చికిత్స ద్వారా తొలగించవచ్చు.
ఆహార అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకోవటం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్తపడవచ్చు. మార్పులు ఆ సమస్యను పరిష్కరించటమే కాకుండా మూత్రపిండాలు సహా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలోనూ తోడ్పడతాయి.
వేసవిలో ఇంట్లోనే ఉండేవాళ్లు, కార్యాలయాల్లో ఉండి పనిచేసేవాళ్లు రోజులో 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. అదే ఆరుబయట పనిచేసే వాళ్లయితే.. 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలి. గంటల తరబడి మూత్రం రాకుండా ఉందంటే ఆ వ్యక్తి తగినన్ని నీళ్లు తాగట్లేదని అర్థం చేసుకోవాలి. ఏడాదిలో ఏ రుతువులోనైనా శరీరానికి కావాల్సినన్ని మంచినీళ్లు తాగాలి. నీళ్లే మూత్రపిండాలను ఆదుకుంటాయి. తినేప్పుడు, దప్పికైనప్పుడు తాగడంతోపాటు, పడుకునే ముందు మంచినీళ్లు తాగటం అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు మంచినీళ్లు తాగితే రాత్రి శరీరానికి తగినంత నీరు అందుతుంది.
వాతావరణం కాస్త వేడిగా ఉందంటే చాలు.. చాలామంది సోడా, ఐస్ టీ, చాక్లెట్ షేక్ లాంటివి తాగుతుంటారు. ఇవి రక్తంలో ఆక్సలేట్ అనే యాసిడ్‌ను పెంచుతాయి. ఈ యాసిడ్ మూత్రపిండాలలో రాళ్లు పెరగటానికి కారణమవుతుంది. వీటికి బదులుగా నిమ్మరసం తాగండి. కాలంతో సంబంధం లేకుండా పెరుగుతున్న ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి ఇది సాయపడుతుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని నిరోధిస్తుంది.
మాంసం, చేపలు, గుడ్ల ద్వారా లభించే ప్రొటీన్ వల్ల క్యాల్షియం, యూరిక్ యాసిడ్‌తో రాళ్లు ఏర్పడుతున్నాయి. మాంసాహారంలో ఉండే ‘ప్యూరిన్స్’ అనే పదార్థాలు జీర్ణక్రియ వల్ల యూరిక్ యాసిడ్స్‌గా విడిపోతాయి. కాబట్టి పోషకాహారమే అయినా దాని పరిమాణం ఎక్కువైతే శరీరంలో ఏర్పడే యూరిక్ యాసిడ్ పరిమాణం కూడా పెరుగుతుంది. ఈ సమస్య రాకుండా ఉండేందుకు మాంసాహారాన్ని పరిమితంగా తినాలి. ఆహార అలవాట్లలో కచ్చితంగా పరిమితి విధించుకోవాలి.
సాధారణ ఉప్పులో ఉండే సోడియం లవణం వల్ల మూత్రంలో చేరే క్యాల్షియం పరిమాణం పెరుగుతుంది. మూత్రపిండాల్లో చేరిన కాల్షియం ఘనీభవించి రాళ్లుగా మారుతుంది.
ఇక కాఫీ, టీ తరుచూ తీసుకుంటూ ఉండటం ద్వారా శరీరానికి అదనంగా నీరు అందిస్తున్నట్లు చాలా మంది భావిస్తారు. కానీ వీటిలో ఉండే కెఫిన్ వల్ల దేహం నీరు కొల్పోయేస్థితి (డీహైడ్రేషన్)కి చేరుతుంది. అందువల్ల టీ-కాఫీలను తగ్గించాలి. వీలైతే మానేయాలి.
తగినన్ని నీళ్లు తాగకపోతే శరీరంలో నీరు, ద్రవాల శాతం తగ్గుతుంది. ఈ స్థితిలో మూత్రం తక్కువ పరిమాణంలో తయారవుతుంది. మూత్రాశయంలో ఎక్కువ ఒత్తిడి కలిగినప్పుడే మూత్రం విడుదలవుతుంది. తక్కువ మూత్రం తయారయ్యేప్పుడు ఎక్కువ ఒత్తిడి కలగడానికి సమయం కూడా ఎక్కువే పడుతుంది. మూత్రాశయంలో మూత్రం ఎక్కువ సమయం నిలువ ఉన్నప్పుడు బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనినే మూత్రనాళ (యూనినరీ ట్రాక్) ఇన్ఫెక్షన్ అంటారు. మూత్రపిండాలు, వాటి నుంచి మూత్రాన్ని మూత్రాశయానికి చేర్చే యురేటర్ నాళాలు, మూత్రాశయాన్ని కలిపి ‘యూరినరీ ట్రాక్’ అంటారు.
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యూటీఐ) బాధితుల్లో సాధారణంగా కనిపించే సమస్య సిైస్టెటిస్. దీనిలో మూత్రాశయ కుడ్యం వాపునకు గురవుతుంది. అందువల్ల తరచూ మూత్రం వస్తున్నట్లుగా అనిపిస్తుంది. మూత్రవిసర్జన సమయంలో నొప్పి కలుగుతుంది. మూత్రం రక్తంతో, అసాధారణ వాసన కలిగి ఉంటుంది. పొట్టదిగువ భాగంలో నెమ్మదిగా లేదా నిరంతరాయంగా నొప్పి కలుగుతుంది. యూటీఐ ఇన్ఫెక్షన్ బాధితుల్లో తొంభై శాతం మందిలో ఇ.కోలి బాక్టీరియాను గుర్తించారు. ఆహారనాళంలో సహజంగా ఉండే సూక్ష్మజీవులు యురెథ్రాలోకి ప్రవేశించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.
– డాక్టర్. నంద కుమార్ మధేకర్
సీనియర్ యూరాలజిస్ట్ &
రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్