ఒకప్పుడు కిడ్నీలో రాళ్లు రావడం అరుదైన సమస్యగా కనిపించేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య పలకరిస్తున్నది. ఇందుకు మారిన జీవనశైలి ఒక కారణమైతే, అవగాహన లేకుండా తీసుకునే ఆహారం మరో కారణం. అందువల్ల ఏవి తినాలో ఏవి తినకూడదో తెలుసుకుని తింటే, సమస్యను కొంతవరకు దూరం చేసుకోవచ్చు.
పాలకూర: పాలకూరలో ఆక్సలేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి క్యాల్షియంతో కలిసి కిడ్నీలో క్యాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఏర్పడతాయి. పాలకూర ఆరోగ్యానికి మంచిదే అయినా, అధిక మొత్తంలో తీసుకోవడం మానేయాలి.
బీట్రూట్: బీట్రూట్లలో కూడా ఆక్సలేట్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీటిని రెగ్యులర్గా సలాడ్స్లో తీసుకోవడం, జ్యూస్ చేసుకుని తాగడం ఆపేయాలి. అడపాదడపా తీసుకోవాలి కానీ, అదేపనిగా బీట్రూట్కు జై కొట్టొద్దు.
మాంసం (రెడ్ మీట్): రెడ్మీట్లో ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి యూరిక్ యాసిడ్ స్థాయులను పెంచుతాయి. ఫలితంగా కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, మాంసాహారం పరిమితంగా తీసుకోవాలి.
ఫాస్ట్ఫుడ్: హై సోడియం డైట్స్ వల్ల యూరిన్లో క్యాల్షియం ఎక్కువగా విడుదలవుతుంది. ముఖ్యంగా చిప్స్, ఫాస్ట్ఫుడ్ సూప్స్ లాంటివి తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
బ్లాక్ టీ: బ్లాక్ టీని ఆక్సలేట్-హెవీ బెవరేజ్ అంటుంటారు. ఇది ఆక్సలేట్ స్థాయులను బాగా పెంచుతుంది. ముఖ్యంగా నీళ్లు తక్కువగా, బ్లాక్ టీ ఎక్కువగా తాగే వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బ్లాక్ టీకి బదులు హెర్బల్ టీ తాగడం మంచిది.