Kidney Health | మారుతూ వస్తున్న జీవనశైలితో పాటు ఆహార నియమాల్లో లోపాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యాధుల ముప్పు పెరుగుతున్నది. మధుమేహం, గుండె సమస్యల తర్వాత ఎక్కువగా ప్రభావితమయ్యే శరీర భాగాలు కిడ్నీలు, కాలేయమే. షుగర్, హైబీపీ కారణంగా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (Chronic Kidney Disease) పెరుగుతున్నది. చిన్న వయసులో ఉన్న వారిలోనే మధుమేహం, రక్తపోటుకు బాధితులుగా మారుతున్నారు. దాంతో 30 ఏళ్లలోపు కిడ్నీ వ్యాధుల్లో పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. కిడ్నీ వ్యాధుల కారణంగా ఆరోగ్యరంగంపై అదనపు ఒత్తిడి పెరుగుతోందని, అందుకే ప్రతి ఒక్కరూ 20 ఏళ్ల నుంచి కొన్ని అలవాట్లను అలవర్చుకోవడం ముఖ్యమని పేర్కొంటున్నారు.
చురుకైన జీవనశైలి, పౌష్టికాహారం తీసుకోవడం కారణంగా కిడ్నీ సమస్యలు రాకుండా చూడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాలు పక్కటెముకల కింద, వెన్నుముకకు రెండువైపులా ఉంటాయి. మూత్రపిండాలు రక్తం నుంచి వ్యర్థ పదార్థాలు.. అదనపు నీరు, ఇతర మలినాలను ఫిల్టర్ చేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. ఈ వ్యర్థాలన్నీ మూత్రాశయంలో పేరుకుపోతాయి. తర్వాత మూత్రం ద్వారా ఈ మలినాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. మూత్రపిండాలు శరీరంలోని పీహెచ్, సోడియం, పొటాషియం స్థాయిలను సైతం నియంత్రిస్తాయి. అందుకే సంపూర్ణ ఆరోగ్యం కోసం.. కిడ్నీల ఆరోగ్యం కాపాడుకోవాల్సిందేనని వైద్యులు పేర్కొంటున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తప్పించుకునేందుకు చిన్నప్పటి నుంచే పలు అలవాట్లకు దూరంగా ఉండాలని, పలు సూచనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
బీపీ, చక్కెర రెండూ పెరగడం ఆరోగ్యానికి చాలా హానికరం. కిడ్నీలు దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలోని కణాలు రక్తంలో ఉన్న గ్లూకోజ్‌ని ఉపయోగించుకోలేని సందర్భంలో కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేసేందుకు శ్రమపడాల్సి వస్తుంది. అలాగే, అధిక రక్తపోటు సైతం కిడ్నీలకు హాని కలిగిస్తుంది. కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే.. వ్యాధులు రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే రక్తపోటు, షుగర్ అదుపులో ఉంచుకోవాలి.
సమతుల్య, పోషకాహారం తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. సోడియం, ప్రాసెస్డ్ మీట్ కిడ్నీలకు హాని కలిగిస్తాయి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగడం చాలా మంచిది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కాలీఫ్లవర్, బ్లూబెర్రీస్, చేపలు, తృణధాన్యాలు వంటి సహజంగా సోడియం తక్కువగా ఉండే ఆహారంలో తీసుకోవడం మంచిది.
ధూమపానం శరీరంలోని రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఇది మీ శరీరం అంతటా రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ధూమపానం వల్ల కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయని గుర్తించారు. మీరు ధూమపానం చేస్తున్నట్లయితే వెంటనే మానేస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.