Corona JN.1 | కరోనా వేరియంట్ తీవ్రతను ఎలా లెక్కిస్తారు.. జేఎన్.1 అత్యంత ప్రమాదకారా ?
Corona JN.1 | కరోనా... రెండు సంవత్సరాల క్రితం వరకూ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టేది. ఈ మహమ్మారి ఎన్నో ప్రాణాలను బలిగొన్నది. ఆ తరువాత రూపాన్ని, స్వభావాన్ని మార్చుకున్నా.. ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదు.
కరోనా… రెండు సంవత్సరాల క్రితం వరకూ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టేది. ఈ మహమ్మారి ఎన్నో ప్రాణాలను బలిగొన్నది. ఆ తరువాత రూపాన్ని, స్వభావాన్ని మార్చుకున్నా.. ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదు. 2021 తరువాత ఒమిక్రాన్ రూపంలో, ఆ తరువాత దాని ఉపవేరియంట్లుగా ఉనికిని చాటుకునే విఫల ప్రయత్నం చేసింది. ‘హమ్మయ్య! ఇక కరోనా కనుమరుగైంది’ అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరోసారి జేఎన్.1 రూపంలో కలకలం రేపుతున్నది. కరోనా ఉప వేరియంట్ అయిన ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన జేఎన్.1 ప్రస్తుతం దేశంలో అలజడి సృష్టిస్తున్నది. కేరళలో తొలిసారిగా వెలుగుచూసిన ఈ వేరియంట్ ప్రభావంతో అక్కడ రోజూ వందల కేసులునమోదు అవుతున్నాయి. మరణాలూ తప్పడం లేదు. చాపకింద నీరులా ఇది వ్యాపిస్తున్నది.
Corona JN.1 | జేఎన్.1 మరీ కొత్త వేరియంట్ కాదు. మూలాలు పాతవే. ఒమిక్రాన్ ఉపవేరియంట్ అయిన బీఏ.2.86 నుంచి వచ్చిన మరో ఉపవేరియంట్. దీన్ని తొలుత ఫ్రాన్స్‌లో గమనించారు. అనంతరం అమెరికాతోపాటు ఇతర దేశాల్లో వ్యాపిస్తూ వచ్చింది. మన దగ్గర మొదటి కేసును కేరళలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పరిస్థితిని ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రస్ట్’గా ప్రకటించింది. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే.. అత్యంత ప్రమాదకారి అని అర్థం. వేరియంట్ ఆఫ్ ఇంట్రస్ట్ అంటే.. మధ్యస్థం అని భావించాలి. సాధారణంగా, వేరియంట్ తీవ్రతను మూడు కేటగిరిల్లో అధ్యయనం చేస్తారు. ఆ తరువాత అది ఏ రకానికి చెందినదో నిర్ధారిస్తారు. ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి.
1. గ్రోత్.. అంటే వైరస్ తన సంతతిని విస్తరించుకుంటూ కేసులను పెంచే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. ఈ రకమైన గ్రోత్ జేఎన్.1లో మధ్యస్థంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
2. ఇమ్యూన్ ఎస్కేప్.. గతంలో మనకు సమకూరిన ఇన్ఫెక్షన్ను తట్టుకునే శక్తిని లేదా వ్యాక్సిన్‌తో సమకూరిన బలాన్ని ఛేదించే గుణం. ఈ వేరియంట్లో రోగ నిరోధక శక్తితోపాటు వ్యాక్సిన్ వల్ల ఏర్పడిన యాంటీబాడీస్‌ను ఎదుర్కొనే స్వభావం మధ్యస్థంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
3. వ్యాధి తీవ్రత.. ఇది కూడా తక్కువగానే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది.
ఆ ఒక్క మ్యుటేషనే జేఎన్.1కు బలం
ఆ వేరియంట్లోని ఎల్455ఎస్ అనే స్పైక్ ప్రొటీన్‌లో ఏర్పడిన మ్యుటేషన్ వల్లనే దీన్ని జేఎన్.1అని పిలుస్తున్నారు. ఒమిక్రాన్ ఉపవేరియంట్ అయిన బీఏ.2.86 లోని స్పైక్ ప్రొటీన్లలో 20 మ్యుటేషన్లు ఉండగా.. దాని ఉపవేరియంట్ అయిన జేఎన్.1 వైరస్‌లోని స్పైక్ప్రొటీన్లలో 21 మ్యుటేషన్లు ఉన్నాయి. ఆ 21వ మ్యుటేషన్.. జేఎన్.1కు చెందిన ఎల్455ఎస్ అనే స్పైక్ ప్రొటీన్‌లో ఏర్పడింది. ఈ మ్యుటేషన్ల వల్లనే వైరస్‌కు గ్రోత్, ఎస్కేప్ శక్తి అధికం. అంటే, వేగంగా వ్యాపించే స్వభావంతో పాటు యాంటీబాడీస్‌ను, రోగ నిరోధక శక్తిని అధిగమించే శక్తి కొంత ఎక్కువగానే ఉన్నాయి. జేఎన్.1 అనేది బీఏ.2.86కు ఉపవేరియంట్ కావడంతో.. దీన్ని ఆర్టీపీసీఆర్ టెస్టులో నిర్ధారించలేం. జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాల్సిందే.
అందుకే కేరళలో..
కేరళలో అంతర్జాతీయ వాతావరణం ఎక్కువ. ప్రపంచంలోని ప్రతి మూల నుంచీ రాకపోకలు ఉంటాయి. దీనివల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి కారణంగా వైరస్ వ్యాపించే ఆస్కారం అధికం. ఈ క్రమంలోనే, దేశంలోనే తొలి కరోనా కేసు కూడా ఇక్కడే నమోదైంది. ఇప్పుడు జేఎన్.1 కేసు సైతం కేరళలోనే తొలుత వెలుగు చూసింది. దీనికితోడు, ఇక్కడ ప్రజాఆరోగ్య వ్యవస్థ బలంగా ఉంది. అంటే, ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే పరీక్షలు చేస్తారు. దీనివల్ల కూడా కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో నిర్ధారణ పరీక్షలు తక్కువ కావడం వల్ల కేసుల సంఖ్య తక్కువ స్థాయిలో కనిపించవచ్చు.

గర్భిణులకు..
ఒకప్పుడు హై రిస్క్‌లో ఉన్న గర్భిణులు మధ్యస్థ రిస్క్ పరిధిలోకి వచ్చారు. అయితే వీరికి కరోనా సోకినప్పుడు.. సాధారణంగా సిఫారసు చేసే మందులు వాడకూడదు. ఆరోగ్య పరిస్థితి ఆధారంగా నిపుణులు ప్రత్యేక చికిత్స అందిస్తారు. అంతేకాదు, గర్భిణులకు యాంటీకరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. దీనివల్ల వైరస్ సోకే అవకాశాలను నామమాత్రం చేయవచ్చు. సురక్షిత ప్రసవానికి అవకాశం కల్పించవచ్చు.
వీళ్లు హైరిస్క్‌లో..
కరోనా ఆరంభం నుంచి నిన్నమొన్నటి వరకు.. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు హైరిస్క్ పరిధిలో ఉండేవారు. వీరికి వైరస్ సోకితే ప్రాణాంతకమే. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారిపోయినట్టు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ ముగ్గురు సైతం మధ్యస్థ రిస్క్ పరిధిలోకి వచ్చేశారు. అంటే, మునుపటిలా కరోనా ప్రాణాంతకం కానేకాదన్న మాట. ఇక ఇమ్యూనిటీ (రోగ నిరోధక శక్తి) తక్కువగా ఉన్నవారు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, ఆటోఇమ్యూన్ సమస్యతో బాధపడుతున్న వారు మాత్రం హైరిస్క్ జోన్లోనే ఉన్నారు. వైరస్ పట్ల వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తగిన చికిత్స చేయించుకోవాలి.
హైరిస్క్ 6 శాతమే..
గతంలో వైరస్‌కు సంబంధించి హైరిస్క్ 50 శాతానికి పైగా ఉండేది. ఇప్పుడది 6 శాతానికి పడిపోయింది. అంటే, ఇప్పటికిప్పుడు 100 మందికి వైరస్ సోకినా అందులో 6 మంది మాత్రమే హైరిస్క్‌ను ఎదుర్కొనే ఆస్కారం ఉంది. అదే మిడిల్ రిస్క్ అయితే 3 శాతం, లోయర్ రిస్క్ 0.5 శాతం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

పిల్లలకు భయం లేదు
చిన్నపిల్లల విషయంలో భయమే అవసరం లేదు. కరోనా మొదట్లోనూ చిన్నారులపై ఏమంత ప్రభావం చూపలేదు. ఇప్పుడొస్తున్న జేఎన్.1 విషయంలోనూ పిల్లలు ‘లో రిస్క్’ పరిధిలోనే ఉన్నారు. శ్వాసకోశ సమస్యలు, గుండె రుగ్మతలు ఉన్నవారికి మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
మందులున్నాయ్
గతంలో కరోనాకు మద్దతు చికిత్సే ఆధారం. సరైన మందులు లేవు. కానీ ఇప్పుడు కచ్చితమైన యాంటీవైరల్ ఔషధాలు వచ్చాయి. వీటిని డబ్ల్యూహెచ్‌వో కూడా నిర్ధారించింది. మధ్యస్థ రిస్క్ ఉన్న రోగులపై ‘నిర్మట్రెలివిర్’, ‘రిటోనవిర్’ అనే యాంటీవైరల్ మందులు సమర్థంగా పనిచేస్తున్నాయి. మధ్యస్థ, హైరిస్క్ రోగులు హాస్పిటల్లో చేరక ముందు.. ప్రాథమిక దశలోనే వీటిని వినియోగించవచ్చు. హైరిస్క్‌తో దవాఖానలో చేరే రోగులకు ‘రెమ్‌డెసివిర్’ ఇంజక్షన్‌తో సహా ‘బారిసిటినిబ్’, ‘టాసిలిజుమాబ్’ మందులు సిఫారసు చేస్తున్నారు.
లక్షణాలు
గతంతో పోలిస్తే.. నాటి కరోనా వైరస్ లక్షణాలకు భిన్నంగా జేఎన్.1లో 70 శాతానికి పైగా ఎసిమ్టమాటిక్ లక్షణాలే కనిపిస్తున్నాయి. అంటే, చాలా మందిలో బహిరంగంగా లక్షణాలు వెల్లడికావు. ఎక్కువ మందికి వైరస్ వ్యాపించడానికి ఇదో కారణం.

ఈ సీజనల్ లక్షణాలే అధికం..
- సాధారణ జలుబు
- ముక్కు కారడం
- దగ్గు, జ్వరం
- ఒంటి నొప్పులు
- తలనొప్పి
- నీరసం
- కడుపు నొప్పి
- కళ్లు ఎర్రబడటం.
ప్రస్తుతం నమోదు అవుతున్న జేఎన్.1 కరోనా వేరియంట్లో దాదాపు అన్నీ సీజనల్ లక్షణాలే. దీనిలో రెస్పిరేటరీ సిమ్టమ్స్ పెద్దగా లేవు. అందుకని జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మూడు రోజులైనా లక్షణాలు తగ్గకపోతే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెంజా వంటి ఇన్ఫెక్షన్లకు అవకాశాలు ఉంటాయి. ఆస్తమా తీవ్రత పెరగవచ్చు.
జాగ్రత్తలు మేలు
చలికాలంలో హానికర వైరస్లు చాలా బలంగా, ఎంతో వేగంగా విస్తరిస్తాయి. అందుకని ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. ఈ జాగ్రత్తల వల్ల ఒక్క కరోనా నుంచే కాకుండా చలికాలంలో సోకే వివిధ రకాల ప్రమాదకర వైరస్ల నుంచి కూడా తప్పించుకోవచ్చు.
– డాక్టర్ కిరణ్ మాదాల ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడీ, క్రిటికల్ కేర్ విభాగం, నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన
– డా.రాజారావు సూపరింటెండెంట్ గాంధీ హాస్పిటల్, హైదరాబాద్
– మహేశ్వర్‌రావు బండారి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

