Health tips : వేసవి వస్తుందంటేనే భయమైతుంది. మండే ఎండలను తలుచుకుంటే వామ్మో అనిపిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దాంతో బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవడం కోసం రకరకాల ప్రయాసలు పడాల్సి వస్తుంది. కొబ్బరి బోండాలు, చెరుకు రసం, నిమ్మ రసం, వాటర్ మిలన్ లాంటి వాటిని ఆశ్రయిస్తుంటారు. ముఖ్యంగా కొబ్బరి బొండాలపై ఎక్కువగా ఆధారపడుతారు. దాంతో వేసవి వచ్చిందంటే కొబ్బరి బోండాల ధరలు అమాంతం పెరిగిపోతాయి. అయితే వాస్తవానికి శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో కొబ్బరి నీరు దివ్య ఔషధం ఏమీ కాదని, తరచూ మంచి నీళ్లు తాగితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ అరటిపండు తిని నీళ్లు తాగితే బాడీ డీహైడ్రేట్ అయ్యే ప్రమాదమే ఉండదని అంటున్నారు.
చాలామంది వేసవిలో కొబ్బరి నీళ్లు తాగకపోతే వేడి చేస్తుందని, ముక్కు నుంచి రక్తం కారుతుందని చెబుతుంటారు. కానీ అది వాస్తవం కాదు. అలాంటి సమస్య ఉంటే ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించాలే గానీ కొబ్బరినీరు తగ్గిస్తుందని అపోహ పడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చాలామంది మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కొబ్బరి నీరే మంచిదనుకుంటారు. అది కూడా సరైనది కాదు. ఎందుకంటే కొబ్బరినీటిలో పోషకాలు ఉన్నాయికానీ వాటికి మూత్రపిండాల్లో రాళ్లను తగ్గించేంత శక్తి అయితే ఉండదని నిపుణులు చెబుతున్నారు. కేవలం వడదెబ్బ తగిలినప్పుడు మాత్రమే కొబ్బరి నీరు తాగితే తక్షణం శక్తిని ఇస్తుందంటున్నారు.
ముఖ్యంగా విరేచనాలు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారికి అలసట బారిన పడకుండా ఉండేలా వైద్యులు నీళ్లకు బదులుగా కొబ్బరి బోండాలను సూచిస్తారని నిపుణులు చెబుతున్నారు. అంతేతప్ప ఆ సమస్యలకు కొబ్బరి నీళ్లు ఔషధం ఏమాత్రం కాదని అంటున్నారు. ఒకవేళ కొబ్బరి బోండాలు సరసమైన ధరల్లో దొరికితే కొనుక్కుని తాగడంతో నష్టమేం లేదని, కానీ కొబ్బరి నీళ్లను ఒక దివ్య ఔషధంగా భావించి ధర ఎంతైనా వెచ్చించడం అనవసరమని చెబుతున్నారు.