Afternoon Sleep | మధ్యాహ్నం కాసేపు కునుకు తీస్తే శరీరం, మెదడు తాజాగా మారుతాయని చాలామంది భావిస్తారు. అయితే కొందరికి నిద్ర లేచిన వెంటనే మరింత అలసటగా, అయోమయంగా లేదా నీరసంగా అనిపిస్తుంది. ఇది సాధారణ విషయమేనని, దీనికి స్లీప్ ఇనర్షియా (Sleep Inertia) అనే ప్రక్రియ కారణమని నిపుణులు చెబుతున్నారు. మన నిద్ర తేలికపాటి నిద్ర, గాఢ నిద్ర వంటి పలు దశల్లో సాగుతుంది. రాత్రి నిద్రలో ఈ దశలు పూర్తయ్యాక మెదడు క్రమంగా మేల్కొనేందుకు సిద్ధమవుతుంది. కానీ మధ్యాహ్నం కునుకు తీసుకునే సమయంలో అనుకోకుండా గాఢ నిద్ర దశలోనే మేల్కొంటే, మెదడు ఒక్కసారిగా మేల్కొనే పరిస్థితికి సిద్ధంగా ఉండదు. దీంతో శరీరం, మెదడు తాత్కాలికంగా స్పందించడానికి కొంత సమయం తీసుకుంటాయి.
ఈ సమయంలో నిద్ర లేచిన వెంటనే మత్తుగా అనిపించడం, అయోమయం, తల తిరిగిన భావన, ఏ రోజు అనేది కూడా క్షణికంగా గుర్తు రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి చెమటలు పట్టడం కూడా జరుగుతుంది. ఎందుకంటే నిద్ర నుంచి మెలకువకు మారే సమయంలో గుండె వేగం, రక్తప్రసరణ, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థలు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోకపోవడమే ఇందుకు కారణం. ఈ సమస్యను నివారించాలంటే కునుకు సమయంపై శ్రద్ధ పెట్టడం అవసరం. నిపుణుల సూచనల ప్రకారం, 10 నుంచి 20 నిమిషాలపాటు మాత్రమే కునుకు తీస్తే గాఢ నిద్ర దశలోకి వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. దీంతో మేల్కొన్న తర్వాత తాజాగా అనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మరొక మార్గం 90 నిమిషాల పూర్తి నిద్ర చక్రాన్ని పూర్తి చేయడం. అయితే 40 నుంచి 50 నిమిషాల వంటి మధ్యస్థ వ్యవధిలో నిద్ర లేవడం వల్ల గాఢ నిద్ర మధ్యలో మేల్కొనే అవకాశం ఉండటంతో అలసట, మత్తు ఎక్కువగా అనిపిస్తాయి. అందువల్ల కునుకు తీయడం తప్పు కాదు. అయితే సరైన సమయం పాటు మాత్రమే నిద్రపోవడం, గాఢ నిద్ర దశలో మేల్కొనకుండా చూసుకోవడం ద్వారా నిద్ర లేచిన తర్వాత వచ్చే అలసట, అయోమయాన్ని చాలా వరకు నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.