వానకాలంలో జ్వరాలు పీడించడం సహజం. వీటిలో ప్రధానంగా ఇన్‌ఫ్లూయెంజా ప్రభావం అధికంగా ఉంటుంది. శ్వాస వ్యవస్థలో భాగమైన ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకు వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇన్‌ఫ్లూయెంజా సంభవిస్తుంది. దీన్ని క్లుప్తంగా ఫ్లూ అని పిలిచినప్పటికీ కొన్ని రకాలైన ఫ్లూ వైరస్లు పొట్టకు ఇబ్బందికరంగా ఉంటాయి. వీటి కారణంగా అతిసారం, వాంతులు లాంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి శ్వాసవ్యవస్థకు సోకే ఫ్లూ, పొట్టకు సమస్యగా ఉండే ఫ్లూ వేర్వేరని గ్రహించాలి. ఇక ఇన్‌ఫ్లూయెంజా బారినపడిన చాలామంది తమంతట తామే కోలుకుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం దీనివల్ల తలెత్తే లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇన్‌ఫ్లూయెంజా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇన్‌ఫ్లూయెంజా… వానకాలం, చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల్లో ప్రధానమైంది. ప్రస్తుతం తెలంగాణలో సీజనల్ వ్యాధిగ్రస్తుల్లో దాదాపు 80 శాతం మంది ఇన్‌ఫ్లూయెంజా బాధితులే. సాధారణంగా వానకాలంలో పరిసరాలు చిత్తడిగా తయారవుతాయి. పైగా గాలిలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వాతావరణంలోని వైరస్లు చురుగ్గా మారిపోతాయి. గాలిలో తేలుతూ ఉండే వైరస్‌లను శ్వాస ద్వారా పీల్చినప్పుడు మనుషులకు సోకుతాయి. ఫలితంగా ఆయా వైరస్‌లకు సంబంధించిన జ్వరాలు, జబ్బులు వస్తాయి. సాధారణంగా పొడి వాతావరణంలో వైరస్ల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. కారణం వైరస్ బలహీనంగా ఉండి వాతావరణంలో కిందిభాగాన ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణించలేదు.
అంతే కాకుండా ఎవరైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న రోగి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు అతని నోటి తుంపర్ల నుంచి బయటికి వచ్చిన వైరస్ అక్కడికక్కడే కిందపడిపోతుంది. అదే వాతావరణం తేమగా ఉన్నప్పుడయితే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్టెడ్ రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటి తుంపర్ల నుంచి వైరస్ ఎక్కువ దూరం వ్యాప్తి చెందుతుంది. దీంతో ఒకరినుంచి మరొకరికి సులభంగా వైరస్ సోకుతుంది. కాబట్టి, ఒక ఇంట్లో ఎవరికైనా వైరల్ ఫీవర్ వచ్చిందంటే వెంటవెంటనే ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. అక్కడితో ఆగకుండా ఇరుగు పొరుగు ఇండ్లవారికి కూడా వ్యాపిస్తుంది. అలా వానకాలంలో ఇన్‌ఫ్లూయెంజా ప్రభావం అధికంగా ఉంటుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందులో డెంగీ, చికున్‌గున్యా, ఇన్‌ఫ్లూయెంజా తదితర జ్వరాల కేసులే అధికంగా ఉంటున్నాయి. ఇకపోతే సాధారణంగా సీజనల్ వ్యాధులు అంత ప్రమాదకరమైనవేమీ కాదు. కానీ సకాలంలో చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేయకూడదు. రిస్క్ ఎక్కువగా ఉన్నవాళ్లకు తీవ్రమైన ఇన్‌ఫ్లూయెంజా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఇన్‌ఫ్లూయెంజా అనేది కరోనా తరహా అంటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఫ్లూ ఉన్నవారు తుమ్మినా, దగ్గినా లేదా వారి నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఇంట్లో ఒకరికి వస్తే దాదాపు అందరినీ చుట్టేస్తుంది. ఇన్‌ఫ్లూయెంజాలో 4 రకాలు ఉన్నాయి. అవి…
ఇది వానకాలం, చలికాలంలో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ ఫ్లూ సోకిన వారిలో జలుబు, జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇది కూడా చల్లటి వాతావరణంలో అంటే వానకాలం, చలికాలంలోనే ప్రభావం చూపుతుంది. దీని లక్షణాలు కూడా దాదాపు ఎ-రకం ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలనే పోలి ఉంటాయి. సాధారణంగా వానకాలంలో ఎ, బి రకం ఫ్లూలే అధికంగా వస్తుంటాయి.
ఈ తరహా ఇన్‌ఫ్లూయెంజా చాలా అరుదుగా వస్తుంది. అయితే ఇది పెద్ద ప్రమాదకారి కాదు.
ఈ రకం జంతువులకు సోకుతుంది. మనుషులకు రాదు.
సాధారణంగా ఇన్‌ఫ్లూయెంజా అనేది ఎవరికైనా ఓ వారం పది రోజుల్లో తగ్గిపోతుంది. అయితే, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మాత్రం ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, డయాబెటిస్, క్షయ (టీబీ), హెచ్ఐవీ, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇన్‌ఫ్లూయెంజా ప్రమాదకరంగా మారడానికి ఆస్కారం ఉంది. లక్షణాలను
బట్టి ఇచ్చే చికిత్స (సింప్టమాటిక్ ట్రీట్మెంట్)తోనే తగ్గిపోయినప్పటికీ సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే వైరస్ గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటి అవయవాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఫలితంగా ప్రధాన అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా
మారే ప్రమాదం ఉంటుంది. అందుకని ఇన్‌ఫ్లూయెంజా లాంటి సీజనల్ జ్వరాలను నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం.
ఇన్‌ఫ్లూయెంజా బారినపడ్డప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా న్యుమోనియా దాడిచేసే ప్రమాదం ఉంటుంది. చిన్నారులు, వృద్ధుల్లో దీనివల్ల న్యుమోనియా వచ్చి ఊపిరితిత్తులు మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోతాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటమే కాకుండా సకాలంలో సరైన చికిత్స అందించకపోతే పరిస్థితి చేయిదాటిపోవచ్చు. ప్రతి పదిమంది ఇన్‌ఫ్లూయెంజా రోగుల్లో ఇద్దరు న్యుమోనియాకు గురవుతుంటారు. కాబట్టి ఇన్ఫ్లూయెంజాను తేలికగా తీసుకోకూడదు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఇన్‌ఫ్లూయెంజా నిర్ధారణకు త్రోట్ స్వాబ్ పరీక్ష చేస్తారు. దీని ద్వారా సోకింది ఏ రకం వైరస్ అనేది కూడా గుర్తించవచ్చు.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ పరంజ్యోతి
పల్మనాలజి విభాగ అధిపతి
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్