న్యూఢిల్లీ : జీర్ణ క్రియ సాఫీగా సాగడంతో పాటు పోషకాలను శరీరం సక్రమంగా గ్రహించేందుకు మన ఆహారంలో ఫైబర్ ప్రధానంగా తోడ్పడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలోనూ ఫైబర్ కీలకం. ఫైబర్ తగినంతగా తీసుకోకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు ముంచుకొస్తాయి. ఫైబర్ తగినంతగా తీసుకునేందుకు రోజులో వివిధ సమయాల్లో తీసుకునే ఆహారంలో ఫైబర్‌ను భాగం చేసుకోవాలి.
ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్‌ను తీసుకుంటే మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఓట్స్‌తో పోషకవిలువలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ అందుబాటులోకి రావడమే కాకుండా మన రోజువారీ ఫైబర్ అవసరాల్లో అధిక భాగం దీంతో శరీరానికి అందుతుంది. ఇక మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం స్నాక్స్ కోసం నట్స్, సీడ్స్ తీసుకోవడం ద్వారా ఫైబర్ అందేలా చూసుకోవచ్చు.
నట్స్, సీడ్స్‌లో ఫైబర్‌తో పాటు శక్తినిచ్చే ప్రొటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇక పండ్లు, కూరగాయలు పీచు తీయకుండా నేరుగా తినడం ద్వారా వాటిలోని ఫైబర్‌ను శరీరం గ్రహిస్తుంది. ఆకలి వేసిన సమయంలో జంక్‌ఫుడ్ బదులు ఫైబర్ ఎక్కువగా ఉండే పాప్‌కార్న్ తీసుకోవడం మేలని చెబుతున్నారు. ఇక వైట్ రైస్ బదులు ఫైబర్ పుష్కలంగా ఉండే హోల్ వీట్ గ్రెయిన్ బ్రెడ్ మంచిదని సూచిస్తున్నారు.