Kidney Diseases | మన శరీరంలో మూత్రపిండాలు అనేక విధులను నిర్వర్తిస్తాయి. ఇవి చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ అత్యంత శక్తివంతమైన అవయవాలు. రక్తాన్ని శుభ్రపరచడం, శరీరంలో వ్యర్థాలను తొలగించడం వంటి పనులను 24 గంటల పాటు చేస్తూనే ఉంటాయి. కనుక మనం మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. అయితే మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుతోంది. మూత్రపిండాల వ్యాధులు ఎటువంటి లక్షణాలు లేకుండానే అభివృద్ది చెందుతాయి. కనుక వీటిని గుర్తించడం చాలా అవసరం. సమస్య తీవ్రమైన తరువాత బాధపడడం కంటే వాటి లక్షణాలను ముందుగానే గుర్తించి నివారించడం మంచిది.
మూత్రపిండాల సమస్యలను ముందుగా గుర్తించడానికి రక్తం, మూత్ర పరీక్షలు చేయంచుకోవడం అవసరం. సీరం క్రియాటినిన్, జిఎఫ్ఆర్ ( గ్లోమెరులర్ వడపోత రేటు) వంటి పరీక్షలు మూత్రపిండాల పనితీరును తెలియజేస్తాయి. అలాగే అదనపు ప్రోటీన్ ను గుర్తించడానికి యూరిన్ అల్బుమిన్ క్రియాటినిన్ నిష్పత్తి వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఇది మూత్రపిండాల ఒత్తిడిని తెలియజేసే ఒక సంకేతం. అంతేకాకుండా మూత్రపిండాలు అధిక రక్తనాళ అవయవాలు కనుక వాటి ఆరోగ్యం గుండె ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉంటుందని కూడా వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాల సమస్యలు ముందుగా అలసట, చీలమండలంలో వాపు, శ్వాస ఆడకపోవడం, వికారం, వాంతులు లేదా చర్మం దురద వంటి లక్షణాలను కనబరుస్తాయి. మూత్రంలో మార్పులు కూడా మూత్రపిండాల సమస్యలను తెలియజేస్తాయి. అయితే ఈ లక్షణాలు ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండవు.
పురుషులలో విస్తరించిన ప్రోస్టేట్ కారణంగా మూత్రనాళంలో అడ్డంకులు ఏర్పడటం వలన మూత్రపిండాలపై వెన్ను ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. అలాగే ఇవి ఇతర అనారోగ్య సమస్యలను కూడా సూచించవచ్చు. కనుక వీటిని ముందుగా గుర్తించి రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఇక మూత్రపిండాల సమస్యలు రాకూడదు అనుకునే వారు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. శరీర బరువు అదుపులో ఉంచుకోవడానికి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. అధిక ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. అలాగే యాంటీ ఇన్ఫ్లామేటరీ మందులను దీర్ఘకాలం పాటు వాడడం మానేయాలి. మూత్రపిండాల ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దీని వల్ల సమస్యలు మరింత తీవ్రతరం కాకుండా జాగ్రత్త పడడంతో పాటు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.