Heat | దేశవ్యాప్తంగా వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినప్పటికీ ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉంటాయని ఇప్పటికే ఐఎండీ తెలిపిన నేపథ్యంలో ప్రస్తుతం చాలా చోట్ల ఇంకా వేసవి తీవ్రత కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటుండడంతో వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలు ఇంకా చాలా మందికి వస్తున్నాయి. సాధారణంగా వేడి వల్ల అలసట, వడదెబ్బ ఒకటేనని చాలామంది భావిస్తుంటారు. అయితే ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉందని, సరైన సమయంలో లక్షణాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి వల్ల కలిగే అలసట (హీట్ ఎగ్జాస్షన్), వడదెబ్బ (హీట్ స్ట్రోక్) ఒకే సమస్యకు చెందిన రెండు దశలు అయినప్పటికీ, వడదెబ్బను అత్యవసర వైద్య పరిస్థితిగా పరిగణిస్తారు. హీట్ ఎగ్జాస్షన్ సమయంలో అధికంగా చెమటలు పట్టడం, బలహీనత, తలతిరగడం, తలనొప్పి, వికారం, కండరాలు పట్టేయడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే బాధితుడు అప్రమత్తంగానే ఉంటాడు. కానీ శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు మెదడు పనితీరు దెబ్బతిని గందరగోళం, మాట తడబడటం, అసాధారణ ప్రవర్తన, స్పృహ కోల్పోవడం లేదా ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే దానిని వడదెబ్బగా గుర్తించి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
వడదెబ్బ వచ్చిన ప్రతి వ్యక్తికి చెమటలు ఆగిపోతాయని అనుకోవడం కూడా అపోహే. కొంతమందిలో ముఖ్యంగా శారీరక శ్రమ వల్ల వచ్చే హీట్ స్ట్రోక్ సమయంలో చెమటలు కొనసాగుతాయి. అయితే కొందరిలో శరీరం తీవ్రమైన వేడి, డీహైడ్రేషన్‌ను తట్టుకోలేక చెమట ఉత్పత్తి ఆగిపోవడంతో చర్మం వేడిగా, పొడిగా మారుతుంది. అయినప్పటికీ చెమటలు లేకపోవడాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని వడదెబ్బను నిర్ధారించకూడదని, మానసిక స్థితిలో మార్పులే అత్యంత కీలక హెచ్చరిక సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైనట్లు అనిపిస్తే వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వాలి. ఆ వ్యక్తిని చల్లని లేదా నీడ ఉన్న ప్రదేశానికి తరలించి అదనపు దుస్తులు తొలగించాలి. చల్లని నీటితో శరీరాన్ని తడపడం, తడి టవల్స్ ఉంచడం, ఫ్యాన్ గాలి అందించడం లేదా మెడ, చంకలు, తొడల వద్ద ఐస్ ప్యాక్‌లు ఉంచడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలి. స్పృహలో ఉండి నీళ్లు మింగగలిగితే కొద్దికొద్దిగా చల్లటి ద్రవాలు ఇవ్వవచ్చు. అయితే స్పృహ లేకపోతే లేదా గందరగోళంగా ఉంటే బలవంతంగా నీళ్లు తాగించకూడదు.
ఉష్ణోగ్రతతోపాటు గాలిలో తేమ కూడా శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చెమట ఆవిరైపోవడం ద్వారానే శరీరం చల్లబడుతుంది. కానీ తేమ ఎక్కువగా ఉంటే చెమట ఆవిరి కాకపోవడంతో శరీరంలో వేడి పేరుకుపోతుంది. దీంతో సాధారణ ఉష్ణోగ్రతల వద్ద కూడా హీట్ ఎగ్జాస్షన్ లేదా హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఉష్ణోగ్రత 32 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ దాటడంతోపాటు తేమ కూడా ఎక్కువగా ఉంటే కఠినమైన బహిరంగ వ్యాయామాలకు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. వడగాల్పుల సమయంలో వ్యాయామం చేయాలనుకునేవారు సూర్యోదయానికి సమీపంలోని సమయాన్ని ఎంచుకోవడం ఉత్తమం. సాయంత్రం కూడా రోడ్లు, భవనాలు రోజంతా నిల్వచేసుకున్న వేడిని విడుదల చేస్తుండటంతో ప్రమాదం పూర్తిగా తగ్గదు. ఈ కాలంలో వ్యాయామ తీవ్రత తగ్గించి, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ తగినంత ద్రవాలు తీసుకోవాలి. తలతిరగడం, తీవ్రమైన అలసట, వికారం లేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే వెంటనే వ్యాయామాన్ని ఆపాలి.
వృద్ధులు, పిల్లలు, యువ క్రీడాకారులు, అధిక బరువు ఉన్నవారు, గుండె, మధుమేహం లేదా మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు, అలాగే కొన్ని మందులు వాడేవారు వేడి ప్రభావానికి త్వరగా గురయ్యే అవకాశం ఉంటుంది. వీరిలో దాహం అనిపించే సామర్థ్యం తగ్గిపోవడం లేదా శరీరం వేడిని బయటకు పంపే ప్రక్రియ సరిగా పనిచేయకపోవడం వల్ల ప్రమాదం మరింత పెరుగుతుంది. దీంతో ఎక్కువగా నీళ్లు తాగాలని సూచిస్తుంటారు. అయితే చెమట ద్వారా కోల్పోయే లవణాలను భర్తీ చేయకుండా కేవలం అధిక మొత్తంలో నీళ్లు మాత్రమే తాగితే రక్తంలో సోడియం స్థాయి ప్రమాదకరంగా తగ్గే హైపోనాట్రీమియా సమస్య తలెత్తుతుంది. దీనివల్ల తలనొప్పి, వికారం, అయోమయం, కండరాలు పట్టేయడం, తీవ్రమైన పరిస్థితుల్లో ఫిట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నీటితోపాటు ఎలక్ట్రోలైట్లు ఉన్న పానీయాలు, సాధారణ ఆహారం తీసుకోవడం ద్వారా సమతుల్య హైడ్రేషన్‌ను కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఐస్ చల్లని నీళ్లు తాగితే శరీరానికి షాక్ వస్తుందనే నమ్మకానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న చాలా మందికి చల్లని నీరు తాగడం సురక్షితమే కాకుండా శరీర ఉష్ణోగ్రత తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో తాగకుండా కొద్దికొద్దిగా తాగడం మంచిది.
ఆమ్ పన్నా, మజ్జిగ, నిమ్మరసం వంటి సంప్రదాయ భారతీయ పానీయాలు సరైన పరిశుభ్రతతో తయారు చేస్తే శరీరానికి ద్రవాలతోపాటు కొంతమేర ఎలక్ట్రోలైట్లను కూడా అందిస్తాయి. ఎక్కువసేపు వ్యాయామం చేసే వారికి స్పోర్ట్స్ డ్రింక్స్ ఉపయోగపడతాయి. అయితే తీవ్రమైన డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఓఆర్ఎస్ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. చాలామందికి ఆకలి తగ్గడం, కడుపు ఉబ్బరం, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. శరీరాన్ని చల్లబరచేందుకు రక్తప్రసరణ చర్మం వైపు ఎక్కువగా మళ్లడంతో జీర్ణవ్యవస్థకు వెళ్లే రక్తం తగ్గిపోతుంది. దీంతో జీర్ణక్రియ మందగిస్తుంది. అందుకే ఈ కాలంలో తేలికపాటి ఆహారం, పండ్లు, కూరగాయలు, తగినంత ద్రవాలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఎయిర్ కండిషనింగ్ లేని, రద్దీగా ఉండే జిమ్‌లలో వ్యాయామం చేయడం కూడా ప్రమాదకరమే. ఒకేసారి ఎక్కువ మంది వ్యాయామం చేయడం వల్ల గది ఉష్ణోగ్రత, తేమ రెండూ పెరుగుతాయి. ఫ్యాన్లు గాలి అందించినప్పటికీ వేడి, తేమను తగ్గించలేవు. ఇలాంటి పరిస్థితుల్లో శరీరం సరిగా చల్లబడక డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాస్షన్, హీట్ స్ట్రోక్‌తో పాటు తీవ్రమైన కండరాల క్షీణత (రాబ్డోమయోలిసిస్) వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. తలతిరగడం, అయోమయం, తీవ్రమైన కండరాల నొప్పి, అధిక అలసట లేదా మూత్రం ముదురు రంగులో రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.