Cortisol | మనం శరీరం నిత్యం అనేక రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. వాటిలో కార్టిసాల్ అనే హార్మోన్ కూడా ఒకటి. దీనిని ఒత్తిడి హార్మోన్ అని కూడా అంటారు. మూత్రపిండాల మీద ఉండే అడ్రినల్ గ్రంథులు ఈ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయి. మన శరీరం భయానికి, ఒత్తిడికి గురి అయినప్పుడు ఈ హార్మోన్ విడుదల అవుతుంది. శరీరంలో ఒత్తిడిని నిర్వహించడంతో పాటు అనేక విధులను కూడా ఈ హార్మోన్ నిర్వర్తిస్తుంది. జీవక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, రక్తపోటును నియంత్రించడంలో ఇలా అనేక రకాలుగా కార్టిసాల్ హార్మోన్ మనకు సహాయపడుతుంది. అయితే మారిన మన జీవన విధానం కారణంగా ఈ హార్మోన్ మన శరీరంలో అవసరానికి మించి ఉత్పత్తి అవుతుంది. దీంతో మనం అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు శరీరం కొన్ని లక్షణాలను చూపిస్తుంది. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాము. కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరగడం వల్ల శరీరంలో కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరగడం వల్ల నడుము చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. అదేవిధంగా ఎల్లప్పుడూ నీరసంగా ఉంటుంది. మనం ఎంత విశ్రాంతి తీసుకున్నప్పటికి రోజంతా అలసటగా, నీరసంగా ఉంటుంది. ఇది మన శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఎక్కువ మొత్తంలో ఉందని సూచిస్తుంది.
అంతేకాకుండా కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుంది. మనం ఎంత ప్రయత్నించినప్పటికీ నిద్రపట్టకపోవడం కూడా కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉందనడానికి సంకేతమే. అలాగే కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు చిరాకు, ఆందోళన, డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అధికంగా ఉత్పత్తి అయిన కార్టిసాల్ హార్మోన్ రక్తనాళాలు ముడుచుకుపోయేలా చేస్తుంది. దీంతో అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు తలెత్తవచ్చు.
కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఆలోచనా శక్తితో పాటు మెదడు పనితీరు కూడా తగ్గుతుంది. కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరగడం వల్ల శరీరం తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతుంది. ఈ హార్మోన్ స్థాయిలు పెరగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో తరచూ జబ్బుల బారిన పడడంతో పాటు వాటి నుండి కోలుకోవడానికి కూడా సమయం పడుతుంది. ఈవిధమైన లక్షణాలు కనిపించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే ఇవి మరింత తీవ్రమయ్యి తీవ్ర అనారోగ్యానికి గురి కావల్సి వస్తుంది. జీవన విధానంలో, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.