తల్లి గర్భాశయంలోని సౌకర్యవంతమైన స్థావరం నుంచి అకస్మాత్తుగా, ఏ ఆచ్ఛాదనా లేకుండానే.. బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతుంది నవజాత శిశువు. మన ఉష్ణోగ్రతలో శిశువుకు చలిగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవటం అన్నది చిన్నారి మనుగడకు అతి ముఖ్యం. బిడ్డ శరీర ఉష్ణోగ్రత 35.5 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తగ్గడాన్ని ‘హైపోథెర్మియా’ అంటారు. దాదాపు 15 శాతం శిశువులు ఇలా తక్కువ ఉష్ణోగ్రతకు గురవుతారు.
తగినంత ఉష్ణోగ్రత ఉన్న గదిలోనే నిండు చూలాలి ప్రసవం జరిగేలా, అత్తింటివారూ పుట్టింటివారూ జాగ్రత్త తీసుకోవాలి. బిడ్డ జన్మించిన వెంటనే, కొద్దిగా వేడిగా ఉన్న ప్రదేశంలో ఉంచాలి. అంతకు ముందే వేడి చేసి ఉంచిన పొడి బట్టతో తుడిచి, మరొక పొడి బట్టలో చుట్టి పెట్టాలి. బరువు తక్కువ ఉంటే లేబర్ రూమ్‌లో ‘వార్మర్’ కింద ఉంచాలి. రెండు కిలోల కన్నా తక్కువ బరువు ఉన్న శిశువును నర్సరీలో ఉంచాల్సి రావచ్చు. 1,800 గ్రాముల కన్నా తక్కువ బరువు కలిగిన శిశువును ‘ఓపెన్ కేర్ ఇన్క్యుబేటర్’లో ఉంచాలి. 1,000 గ్రాములకన్నా తక్కువ బరువున్న శిశువుల కాట్పై సన్నని ప్లాస్టిక్ షీట్ కప్పడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా, నీరు ఆవిరి రూపంలో బయటికి వెళ్లకుండా నివారించవచ్చు.
సాధారణ శిశువులలో శరీర ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉన్నప్పుడు వణుకు ప్రారంభం అవుతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కానీ, నెలలు నిండని శిశువులలో.. కండరాలు సరిగా అభివృద్ధి చెందకపోవడంవల్ల ఈ సామర్థ్యం ఉండదు. శిశువు ఉష్ణోగ్రత సమతుల్యతను కాపాడే మరొక అంశం ‘బ్రౌన్ ఫ్యాట్’ అనే ఒక ప్రత్యేకమైన కొవ్వు పదార్థం. ఇది గర్భం చివరి మూడు నెలలలో శిశువు శరీరంలో నిలువ అవుతుంది. మెడ, వీపు పైభాగం మధ్య, చంకలు, కటివలయం, మూత్రపిండాల చుట్టూ పేరుకొని ఉంటుంది. దీని నుంచి ఉష్ణం ఉత్పత్తి జరిగి, రక్తం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు చేరుతుంది. చల్లని పరిసరాల్లో ప్రసవం, జన్మించిన వెంటనే చన్నీటి స్నానం, చల్లని బట్టతో తుడవటం.. తదితర చర్యల వల్ల బిడ్డకు ఇబ్బందే. ఇతర ప్రదేశాలలో జన్మించిన శిశువులను నర్సరీకి తరలించినప్పుడు కూడా, తగిన ఏర్పాట్లు లేకపోతే శిశువు ‘హైపోథెర్మియా’కు లోనవుతుంది. నవజాత శిశువుల విషయంలో తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తల గురించి వచ్చేవారం చర్చిద్దాం.
-డాక్టర్ కర్రా రమేష్‌రెడ్డి , పిల్లల వైద్య నిపుణులు