Eggs | మన శరీరానికి అవసరమయ్యే పోషకాలను అతి తక్కువ ధరలో అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కోడిగుడ్లల్లో మనకు కావల్సిన విటమిన్లు, ఖనిజ లవణాలు అనేకం ఉంటాయి. పొటాషియం, నియాసిన్, రైబోప్లేవిన్, మెగ్నిషియం, సోడియం, ఐరన్, జింక్, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ బి6, బి12, ఫోలిక్ ఆమ్లం, పాంతోథెనిక్ ఆమ్లం, ప్రోటీన్స్ వంటి ఎన్నో పోషకాలను గుడ్లు కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మెదడు అభివృద్ది చక్కగా ఉంటుంది. కండరాల బలోపేతానికి, కంటిచూపును పెంచడంలో, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో, శరీరానికి కావల్సిన శక్తిని అందించడంలో ఇలా అనేక రకాలుగా గుడ్లు మన ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా గుడ్లు మనకు తోడ్పడతాయి.
గుండె ఆరోగ్యానికి గుడ్లు మేలు చేసేవే అయినప్పటికీ వీటిని అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కోడిగుడ్లను అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు, వారానికి ఎన్ని గుడ్లను తీసుకోవాలి.. వంటి వివరాలను వారు వెల్లడిస్తున్నారు. కోడిగుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కోడిగుడ్డులో దాదాపు 180 నుండి 300 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది అంతా కూడా పచ్చసొనలోనే ఉంటుంది. గుడ్డు తెల్లసొనలో కొలెస్ట్రాల్ ఉండదు. గుడ్డు గుండె ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ వీటిని అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక ఈ గుడ్లను చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్, శుద్ది చేసిన పిండి వంటి వాటితో కలిపి కేక్స్, కుకీస్ వంటి ఆహారాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. స్నాక్స్ రూపంలో కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు. దీంతో ఈ క్యాలరీల రేటు మరింత పెరిగి ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. గుండెకు మేలు జరగడం పోయి గుండె జబ్బులు, అధిక బరువు, మధుమేహం, శరీరంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక గుడ్లను తగిన మోతాదులో తీసుకోవడం కూడా చాలా అవసరం.
ఇక ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ చెబుతున్న ప్రకారం మనం రోజుకు 300 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ కలిగిన ఆహారాలను తీసుకోవచ్చు. ఒక గుడ్డులో దాదాపు 180 నుండి 300 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక మనం వారానికి 3 నుండి 4 గుడ్లను తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న వారు వారానికి 3 గుడ్లను తీసుకోవచ్చు. ఇక ఈ గుడ్లను వివిధ వంటకాల్లో భాగం చేయడానికి బదులుగా వీటిని నేరుగా ఉడికించి తీసుకున్నప్పుడే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. గుడ్డులోని పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి. ఇలా తగిన మోతాదులో ఉడికించి తీసుకున్నప్పుడే గుడ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.