Raisins | మనకు తినేందుకు అనేక రకాల డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కిస్మిస్లు కూడా ఒకటి. వీటినే ఎండు ద్రాక్ష అని కూడా పిలుస్తారు. వీటిని మనం స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటాం. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు, అనేక పోషకాలను అందిస్తాయి. అయితే కిస్మిస్లను రోజూ నీటిలో నానబెట్టి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. కానీ కిస్మిస్లను అసలు రోజుకు ఎన్ని తినాలి.. అనే సందేహం వస్తుంటుంది. ఇందుకు వారు ఏమని సమాధానం చెబుతున్నారంటే.. కిస్మిస్లను పెద్దలు అయితే రోజుకు 50 గ్రాముల వరకు తినవచ్చు. నీటిలో నానబెట్టి తింటే పోషకాలు శరీరానికి సరిగ్గా లభిస్తాయి. పిల్లలకు అయితే 20 గ్రాముల మేర కిస్మిస్లను రోజూ నీటిలో నానబెట్టి తినిపించవచ్చు. దీంతో సులభంగా జీర్ణమవుతాయి.
కిస్మిస్లను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేస్తుంది. అందువల్ల కిస్మిస్లను తింటే పేగుల్లో మలం కదలికలు సాఫీగా జరుగుతాయి. దీంతో మలబద్దకం తగ్గిపోతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి పూట కిస్మిస్లను నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే శరీరం చాలా వరకు పోషకాలను సులభంగా గ్రహిస్తుంది. అలాగే సులభంగా జీర్ణమవుతాయి కూడా. కిస్మిస్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటు నియంత్రించేందుకు సహాయం చేస్తుంది. వీటిల్లో పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్)ను పెంచుతాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
కిస్మిస్లను రాత్రి పూట నీటిలో నానబెట్టి వాటిని ఉదయం తింటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. బద్దకం పోతుంది. యాక్టివ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. రోజంతా శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. నీరసం, అలసట ఉండవు. ఎంత పనిచేసినా చురుగ్గానే ఉంటారు. కిస్మిస్లలో పిండి పదార్థాలు, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనే సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందించి ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. కిస్మిస్లలో ఫినాల్స్, పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం కారణంగా ఇవి ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
కిస్మిస్లలో ఎముకల ఆరోగ్యానికి అవసరం అయిన అనేక పోషకాలు ఉంటాయి. క్యాల్షియం, మెగ్నిషియం, బోరాన్ అధికంగా ఉంటాయి. బోరాన్ వల్ల కిస్మిస్లలో ఉండే క్యాల్షియం, మెగ్నిషియంలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. కిస్మిస్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. రక్తం తక్కువగా ఉన్నవారు సాధారణ కిస్మిస్లకు బదులుగా నలుపు రంగులో ఉండే కిస్మిస్లను నానబెట్టి తింటే ఇంకా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఇలా కిస్మిస్లను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.