న్యూఢిల్లీ : యాంటీబయాటిక్‌గా పేరొందిన పసుపును పలు ఇండ్లలో మసాలా దినుసుతో పాటు యాంటీసెప్టిక్గానూ విస్తృతంగా వాడుతుంటారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆరోగ్య నిపుణులు పసుపును వాడాలని సూచిస్తుంటారు. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పదార్ధం కుంగుబాటుకు దారితీసే వాపు ప్రక్రియను నివారిస్తుంది.
పసుపు వాడకంతో మూడ్ స్వింగ్స్‌ను కూడా నివారించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం కుదుటపడే ఔషధాలు పసుపులో పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. పసుపులో ఉండే కుర్కుమిన్ ద్వారా డిప్రెషన్ చికిత్సలో వాడే మందుల్లో ఈ పదార్ధాన్ని జోడించడంపై పలు అధ్యయనాలు జరుగుతున్నాయి.
అయితే కుంగుబాటు చికిత్సలో భాగంగా ఎక్కువ మోతాదులో పసుపు వాడితే ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పసుపు అతిగా వాడితే మలం రంగు మారడం, తలనొప్పి, డయేరియా వంటి సైడ్ ఎఫెక్ట్స్ పొంచిఉంటాయని చెబుతున్నారు. టర్మరిక్ సప్లిమెంట్స్ సామర్ధ్యం, భద్రతపై ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వీటి వాడకం పట్ల జాగ్రత్తగా ఉండాలని అమెరికాకు చెందిన సైకియాట్రిస్ట్ యల్దా సఫై పేర్కొన్నారు.