న్యూఢిల్లీ : బిజీ లైఫ్‌లో ఆహార అలవాట్లు గజిబిజీగా మారడం, నిద్రలేమి, ఒత్తిళ్లతో మలబద్ధకం పలువురిని వెంటాడుతోంది. అనారోగ్యకర ఆహారం తీసుకోవడం, మద్యపానం వంటి అలవాట్లతో ప్రేవు ఆరోగ్యం దెబ్బతిని మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వేధిస్తుంటాయి. మలబద్ధకం దీర్ఘకాలం కొనసాగితే అది పైల్స్ వంటి ఇతర అనారోగ్యాలకూ దారితీస్తుంది.
మలబద్ధకాన్ని ఆరోగ్యకరమైన ఆహారం, మెరుగైన జీవనశైలితో అధిగమించవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మలబద్ధకాన్ని వంటింటి చిట్కాలతో నివారించవచ్చని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లవ్‌నీత్ బాత్రా ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో వెల్లడించారు. నీటిలో ఉసిరికాయ రసాన్ని కలిపి ఉదయాన్నే తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుందని సూచించారు.
గ్లాస్ పాలలో స్పూన్ నేయి కలుపుకుని తాగితే మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు. వీటితో పాటు పెరుగులో అవిసెగింజల పొడి కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని, అవిసె గింజల్లో అధికంగా ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుందని ఆమె తెలిపారు. ఇక ఓట్స్‌ను తరచూ తీసుకోవాలని లవ్‌నీత్ బాత్రా సూచించారు. వేడి పాలలో టీస్పూన్ నేయి కలుపుకుని రాత్రి సమయంలో తీసుకుంటే మరుసటి రోజు ఉదయం మలబద్ధకం బాధించదని చెప్పారు.