జగిత్యాల, ఫిబ్రవరి 6 : పార్టీ మారిన తర్వాత రెండేళ్లలో జగిత్యాల ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఎక్కడుందని ఎమ్మెల్సీ ఎల్ రమణ సూటిగా ప్రశ్నించారు. పట్టణంలోని పలు వార్డుల్లో శుక్రవారం ఆయన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, దగా కోరు రాజకీయాలకు స్వస్తి పలకాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, జగిత్యాల జిల్లా అంటేనే ఉద్యమాల ఖిల్లా అని, అలాంటి జగిత్యాల పట్టణ ఓట్లతోనే సంజయ్ గెలిచిన విషయం గుర్తుంచుకోవాలని హితవుపలికారు. బీఆర్ఎస్ ఓట్లతో గెలిచి అభివృద్ధి కోసం అంటూ ప్రభుత్వంతో కలిసి పని చేయడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, జగిత్యాల ఎమ్మెల్యేకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని, ఆయన రంగులను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాజేశం గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఓరుగంటి రమణారావు, బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు ఖాసీం బాయి, దేవేందర్‌నాయక్, ఏనుగుల భూమయ్య, తుమ్మనపెల్లి భారతీసంతోష్, చింతల గంగాధర్, పంతం అనురాధ, తదితరులు పాల్గొన్నారు.