బంజారాహిల్స్,ఫిబ్రవరి 6: వంటమనిషిగా నమ్మించి ఓ వ్యాపారి ఇంట్లో చేరిన నేపాల్‌కు చెందిన యువకుడు మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి భారీ చోరీకి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.69లోని నందగిరి హిల్స్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న రవీంద్ర కుమార్ శర్మ అనే వ్యక్తి ఫార్చ్యూన్ ఫోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వారి ఇంట్లో వంట మనిషిగా రాకేష్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. గత నెల 18న నేపాల్‌కు చెందిన భూపేందర్ షాహీ అనే యువకుడు మదన్ అనే ఏజెంట్ ద్వారా రవీంద్ర కుమార్ శర్మ ఇంట్లో అసిస్టెంట్ కుక్‌గా చేరాడు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం రవీంద్రకుమార్ శర్మ తన భార్య, కోడలు, మనవరాలితో పాటు కేర్‌టేకర్‌తో కలిసి బంజారాహిల్స్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు.
కొడుకు టెన్నిస్ అడేందుకు బయటకు వెళ్లాడు. కాగా రెండుగంటల తర్వాత ఇంటికి వచ్చిన రవీంద్రశర్మ కోడలు లోనికి వెళ్లిచూడగా భూపేందర్తోపాటు మరో వ్యక్తి చేతిలో బ్యాగ్‌తో బయటకు పరుగెత్తడం కనిపించింది. ఇంట్లో కుక్‌గా పనిచేస్తున్న రాకేష్, వాచ్మెన్ నాగేశ్వర్రావు, వాచ్మెన్ భార్య నీరజ అపస్మారక స్థితిలో తాళ్లతో బంధించబడి కనిపించారు. రెండో అంతస్తులోకి వెళ్లిచూడగా బెడ్రూమ్లోని కప్బోర్డు పగలగొట్టబడి కనిపించింది. కప్‌బోర్డులో ఉన్న ఆభరణాల బాక్స్ మాయమైనట్లు గుర్తించారు. కుక్ రాజేష్, వాచ్మెన్ నాగేశ్వర్రావు మత్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాకబు చేయగా తమకు భూపేందర్ కూల్‌డ్రింక్ ఇచ్చాడని, దాన్ని తాగిన తర్వాత మత్తు ఆవహించిందని చెప్పారు.
దీంతో పక్కా ప్రణాళికతో భూపేందర్ తమ ఇంట్లో పనికి కుదిరిన తర్వాత మరో ముగ్గురితో కలిసి చోరీకి పాల్పడ్డాడని రవీంద్రకుమార్ శర్మ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీగా బంగారు ఆభరణాలతోపాటు వజ్రాలు ఉన్నాయని, వాటి విలువను లెక్కించాల్సి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు అదనపు కమిషనర్ శ్వేతతో పాటు జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడిన ముఠాలో నలుగురు సభ్యులున్నారని భావిస్తున్నారు. నేపాల్నుంచి నగరానికి వచ్చి రెక్కీ నిర్వహించిన అనంతరం ఈ ఇంట్లో చోరీకి పాల్పడ్డారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. నిందితులను పట్టుకునేందుకు స్థానిక పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ సహా 10 బృందాలు రంగంలోకి దిగాయి. చోరీకి పాల్పడిన వారు నేపాల్‌కు పారిపోయే అవకాశం ఉండడంతో కొన్ని బృందాలు అక్కడకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.