అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) జీవనశైలికి సంబంధించిన వ్యాధి. నడివయసువారు, వృద్ధుల్లో ఇది సాధారణం. కానీ, ఇప్పుడు యువతరంలోనూ కనిపిస్తుండటం ఆందోళన కలిగించే విషయం. ధమనుల్లో (రక్తనాళాల్లో) సాధారణ ప్రవాహం కంటే రక్తం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీంతో గుండె మీద అదనపు భారం పడుతుంది. దీనినే అధిక రక్తపోటు అంటారు.
జంక్‌ఫుడ్, కదలికలు లేని జీవనశైలి, తగినంత వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, ధూమపానం, ఒత్తిడి లాంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. గుండెజబ్బులు, పక్షవాతం, కిడ్నీ తదితర ఆరోగ్య సమస్యలకు అధిక రక్తపోటు దారితీస్తుంది. వ్యాయామం చేయడం, సమతులాహారం తీసుకోవడం లాంటి జీవనశైలి మార్పులతో హైపర్‌టెన్షన్ నుంచి విముక్తి పొందవచ్చు.
రోజూ వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. అలా శరీరంలో రక్త ప్రసరణను అదుపులో ఉంచుకోవచ్చు. అయితే వ్యాయామం చేస్తున్నప్పుడు రక్తపోటు కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ, అసౌకర్యంగా ఉండటం, శ్వాస తక్కువగా ఆడటం, ఛాతీ పట్టినట్టు అనిపిస్తే మాత్రం వ్యాయామం ఆపేసి, విశ్రాంతి తీసుకోవాలి. అధిక రక్తపోటు ఉన్నవాళ్లకు ఏరోబిక్ వ్యాయామాలు మంచివి. అయితే పరిగెత్తడం, అధిక మోతాదులో బరువులు ఎత్తడం లాంటివి మాత్రం చేయకూడదు. హైపర్‌టెన్షన్ వ్యాధి నిర్ధారణ, చికిత్స పట్ల భారతదేశంలో అంతగా శ్రద్ధ చూపించడం లేదు. కాబట్టి ఈ సమస్య నివారణ, రక్తపోటు స్క్రీనింగ్ పరీక్షల దిశగా ప్రజల్లో అవగాహన పెంచాలి.