ఒత్తిడి, డీహైడ్రేషన్, నిద్రలేమి మొదలైన వాటి కారణంగా తలనొప్పులు వస్తుంటాయి. అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్ లేదా బీపీ) కూడా తీవ్రమైన తలనొప్పికి కారణమవుతుంది. పైగా ఇది మామూలుగా వచ్చే తలనొప్పులకు భిన్నమైంది. హైపర్టెన్సివ్ క్రైసిస్గా పిలిచే విపత్కర పరిస్థితికి దీన్ని సంకేతంగా భావించాలి. సాధారణంగా అధిక రక్తపోటు ప్రత్యక్షంగా ఎలాంటి లక్షణాలనూ ప్రదర్శించదు. అయితే, రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు దానివల్ల తలనొప్పులు, తలతిప్పడం, అలసట, దృష్టి సంబంధ సమస్యలు లాంటివి తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.
మెదడులోని రక్తనాళాల్లో ఒత్తిడి పెరగడం వల్ల అధిక రక్తపోటు సంబంధిత తలనొప్పులు వస్తాయి. రక్తపోటు గణనీయంగా పెరిగినప్పుడు, మెదడులో రక్తనాళాల వ్యాకోచానికి దారితీస్తుంది. దీంతో ఒత్తిడి, నొప్పి పెరుగుతాయి. రక్తసరఫరా మందగించడంతో మెదడు కణజాలానికి ఆక్సిజన్ లభ్యత తగ్గుతుంది. దీంతో తలనొప్పి వేధిస్తుంది.
అధిక రక్తపోటుతో వచ్చే తలనొప్పి కొన్నిసార్లు హైపర్టెన్సివ్ క్రైసిస్, పక్షవాతానికి సంకేతం కావొచ్చు. కాబట్టి రక్తపోటు 180/120 ఎంఎంహెచ్‌జీ కంటే ఎక్కువగా ఉండటం, ఛాతీనొప్పితో కూడిన తీవ్రమైన తలనొప్పి, అకస్మాత్తుగా దృష్టి సమస్యలు, గందరగోళంగా అనిపించడం, మాట్లాడటం కష్టం కావడం, శరీరం ఓ వైపు మొద్దుబారినట్టు ఉంటే వెంటనే వైద్య సాయం పొందాలి. ఆలస్యం చేయకూడదు.