Blood Pressure | ఆధునిక జీవనశైలి సమస్యల్లో బీపీ (అధిక రక్తపోటు) ప్రధానమైంది. బీపీని అదుపులో ఉంచుకోవడానికి ఆయుర్వేదం కొన్ని పరిష్కారాలను సూచిస్తున్నది. వీటిని రోజూ అనుసరిస్తూ, కొన్ని ప్రత్యేకమైన శ్వాస పద్ధతులను సాధన చేయాలి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడంలో దోహదపడతాయి. ఆయుర్వేదం రక్తపోటు సమస్యకు వెంటనే పరిష్కారం చూపించదు కానీ, దీర్ఘకాలికంగా పనిచేస్తుంది. ఆరోగ్యం విషయంలో ఏ మార్పయినా సరే వైద్యుల సలహా మేరకే చేసుకోవాలి.
ఆయుర్వేదంలో వెల్లుల్లిని రక్తాన్ని పలుచన చేసేదిగా పరిగణిస్తారు. వెల్లుల్లిలో ఎలిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది రక్తనాళాలను వ్యాకోచింప చేస్తుంది. తద్వారా రక్త సరఫరా మెరుగుపడుతుంది. పొద్దునే పరగడుపున దంచిన వెల్లుల్లి రెమ్మను వేడినీటితో కలుపుకొని తాగాలి. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది.
ఎనిమిది నుంచి పది ఎండుద్రాక్షలను రాత్రంతా నానబెట్టాలి. వాటిని పొద్దునే పరగడుపున తినేయాలి. ఎండుద్రాక్షలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో అధిక రక్తపోటుకు ప్రధాన కారణమైన సోడియం స్థాయులను తగ్గించడంలో తోడ్పడుతుంది.
శరీరాన్ని గోరువెచ్చటి నూనెతో మర్దనా చేయడం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థకు ఉపశమనం కలిగిస్తుంది. రక్తపోటు నియంత్రణకు ఈ రెండే కీలకంగా వ్యవహరిస్తాయి. నువ్వుల నూనె, బాదం నూనె, బ్రాహ్మీ నూనె రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి, అధిక రక్తపోటును తగ్గిస్తాయి.
కొద్ది మోతాదులో నూనె తీసుకుని తల, మెడ, పాదాలకు పట్టించాలి. ఓ అరగంటపాటు అలా వదిలేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.
గోరువెచ్చటి నీటిలో తులసి, నిమ్మరసం కలుపుకొని తాగాలి. గుండె ఆరోగ్యానికి ఆయుర్వేదం చెప్పే రహస్యం ఇదే. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, ఒత్తిడిని తగ్గించే గుణాలు ఉంటాయి. ఇక నిమ్మరసం శరీరంలో పేరుకుపోయిన అధిక సోడియంను బయటికి
పంపించేస్తుంది.
ఐదారు తులసి ఆకులను గోరువెచ్చటి నీటిలో వేసుకోవాలి. సగం నిమ్మచెక్కను ఆ నీళ్లలో పిండేయాలి. ఈ నీటిని పరగడుపునే తాగేయాలి. ప్రాణాయామం మనసు విశ్రాంతి కోసం, రక్తపోటు సమతూకంలో ఉండటానికి ఆయుర్వేదం ప్రాణాయామాన్ని సూచిస్తుంది. ఇందులో రెండు శక్తిమంతమైన పద్ధతులు ఉన్నాయి.
శీతలి ప్రాణాయామం: నాడీ వ్యవస్థకు ఉపశమనం కలిగిస్తుంది. బీపీని వెంటనే తగ్గిస్తుంది.
అనులోమ విలోమం: ఈ రకం ప్రాణాయామం శరీరంలో ఆక్సిజన్ స్థాయులను సమతూకంలో ఉంచుతుంది. అధిక రక్తపోటు కారణంగా తలెత్తే ఒత్తిడిని తగ్గిస్తుంది.