ఇప్పుడంతా.. ‘75 హార్డ్ చాలెంజ్’ ట్రెండ్ కొనసాగుతున్నది. 2025 నూతన సంవత్సర తీర్మానాల్లో.. ఇప్పుడిదే వైరల్‌గా మారింది. దీని గురించి కొత్తగా వింటున్నవారు మాత్రం.. ‘75 హార్డ్ చాలెంజ్’ అంటే ఏమిటి? దీని నియమాలేంటి? దీన్ని కొనసాగించడం వల్ల కలిగే లాభాలేంటి? నష్టాలేంటి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈక్రమంలో ‘75 హార్డ్ చాలెంజ్’ గురించి వ్యాయామ నిపుణులు ఇలా వివరిస్తున్నారు.
‘75 హార్డ్ చాలెంజ్’లో కఠిన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైనది.. 75 రోజులపాటు ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌కు, మద్యానికి దూరం పాటించాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు చొప్పున 45 నిమిషాలపాటు వ్యాయామం చేయాలి. ఈ రెండు వ్యాయామాల్లో ఒకటి కచ్చితంగా ఇంటి బయటే చేయాల్సి ఉంటుంది. పార్క్, జిమ్, ఆరుబయట ప్రదేశాలను ఎంచుకోవచ్చు. రోజూ మూడు లీటర్ల మంచినీళ్లు తాగాలి. ప్రతిరోజూ కనీసం 10 నిమిషాలపాటు ఒక నాన్ ఫిక్షన్ పుస్తకం చదవాలి. కొంచెం కష్టమైనా.. ఇష్టంగా ఫాలో అయిపోతే మానసికంగా, శారీరకంగా ఎంతో మార్పు కనిపిస్తుందని వ్యాయామ నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు.. ఈ చాలెంజ్లోకి దిగినవారిలో చాలామంది.. 75 రోజులు పూర్తయినా ఈ నియమాలను కొనసాగిస్తూనే ఉన్నారట. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఆహార అలవాట్లు మెరుగుపడటం, పుస్తకాలు చదివే పద్ధతిలోనూ వారు చాలా మార్పులు గమనిస్తున్నారట. 75 రోజులపాటు ఫాలో కావడం వల్ల.. ఈ చాలెంజ్ ప్రభావాలు త్వరగా వదిలిపోవని నిపుణులు చెబుతున్నారు. బయటి ఆహారాన్ని మానేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు డబ్బుకూడా ఆదా అవుతుందని అంటున్నారు. ఇక పుస్తకాలు చదవడం.. ఆలోచనా విధానంలో మార్పులు తీసుకొస్తుంది. ఇలా.. ఇష్టపడి చేస్తే చాలెంజ్‌ను పూర్తి చేయడంతోపాటు దీర్ఘకాలంపాటు కొనసాగించవచ్చని సలహా ఇస్తున్నారు.