Winter health and Vegetables | చలికాలం వచ్చిందంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి. మనం తీసుకునే ఆహారాల్లో పోషకాలు కరవైతే మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని రకాల ఆహారాలను నిత్యం మన ప్లేట్లో ఉండేలా చూసుకోవాలి. శీతాకాలం అద్భుతమైన పోషక విలువలు కలిగి ఉండే ఆకుకూరలను అందిస్తుంది. కొన్ని కూరగాయలు చలి తీవ్రత నుంచి మనల్ని రక్షిస్తాయి. కఠినమైన వాతావరణం, చల్లటి గాలులను తట్టుకోవడంలో ఈ కూరగాయలు మనకు సాయపడతాయి.
బచ్చలి కూరలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. మరీ ముఖ్యంగా ఐరన్ పుష్కలంగా ఉండి మనకు చలికాలంలో ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. బచ్చలి కూరలో విటమిన్ ఏ, బీ, సీ, ఈ, కే లతోపాటు జింక్, మెగ్నీషియం, ఐరన్ లభిస్తుంది. దృష్టి నష్టాన్ని నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మెదడు పనితీరును, నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి క్యాన్సర్లను నివారించడంలో సాయపడతాయి. దీర్ఘకాలిక పొత్తికడుపు బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఇది ఆవపిండి గింజల్ని ఉత్పత్తి చేసే మొక్క. మిరియాల మాదిరిగా రుచిని కలిగి ఉంటుంది. దీనిలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ కంటి, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీనిలో గ్లూకోసినోలెట్స్ అనే ఫైటోన్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన కాలేయం, ఇతర అవయవాల కణాలను ప్రీ-రాడికల్ డ్యామేజ్ల నుంచి రక్షిస్తాయి.
క్యారెట్లో విటమిన్ ఏ, బీ, బీ2, బీ3, సీ, డీ, ఈ, కే తోపాటు అనేక పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే కెరోటిన్ రాత్రి అంధత్వాన్ని నివారిస్తుంది. క్యాన్సర్లను నిరోధిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా సాయపడుతుంది. చర్మం, జుట్టు, గోర్లను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. రుతుచక్రం సక్రమంగా సాగడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీనిలోని విటమిన్ ఏ.. కాలేయాన్ని శుభ్రం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
బీట్రూట్లో ఐరన్, విటమిన్ ఏ, బీ6, సీ తోపాటు అనేక సూక్ష్మపోషకాలు, ముఖ్య ఖనిజాలు ఉంటాయి. ఇవి కాలేయం నుంచి విషాలను బయటకు పంపించడంలో సాయపడతాయి. మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తెల్లరక్త కణాలు పెంచడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తి పెంచుతుంది. రక్తపోటును నిర్వహిస్తుంది. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉన్నందున స్మూతీస్, సలాడ్లలో తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన బరువును మెయింటేన్ చేయడంలో సాయపడుతుంది.
చిలగడదుంపలు ముఖ్యంగా చలికాలంలోనే వస్తాయి. వీటిలో ఫైబర్, బీటా కెరోటిన్, ఏ, బీ6, సీ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. బలబద్దకం, గుండెపోటు, ఫ్లూ వైరస్లు, సాధారణ జలుబులను నివారించడంలో సాయపడతాయి. దీనిలో ఉండే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించుకోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
బ్రోకలి చాలా పోషకాలతో నిండి ఉంటుంది. ధమనులు గట్టిపడటాన్ని నివారిస్తుంది. దీనిలో ఉండే బీటా కెరోటిన్ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. బ్రోకలిలో కాల్షియం, విటమిన్ సీ, కే సమృద్ధిగా ఉంటాయి. జింక్, సెలీనియం కూడా దొరుకుతాయి. అధిక ఫైబర్ కంటెంట్ కావాలనుకునే వారు బ్రోకలిని తినడం చాలా ఉత్తమం. సూపులు, సలాడ్లు, కూరల్లో వాడుకోవచ్చు.