Health | శాకాహారులు ప్రొటీన్ కోసం పాలలో కలుపుకొనే పొడులు, ఇతర షేక్‌ల మీద ఆధారపడొచ్చా. ఇలాంటివి ఆరోగ్యానికి మంచివేనా?
ఓ సోదరి
ఆరోగ్యవంతులైన వ్యక్తులు ప్రొటీన్ సప్లిమెంట్ల మీద ఆధారపడక పోవడమే మంచిది. ఆహారం ద్వారా ప్రొటీన్ అందేలా చూసుకోవాలి. భోజనంలో మనకు సరిపడా ప్రొటీన్ దొరుకుతుంది. అయితే ఈ విషయంలో శాకా హారులు, మాంసాహారుల మధ్య కొంత తేడా ఉంది. దీన్నే ‘బయో అవైలబిలిటీ’ అంటారు. అంటే, మనం తినే ఆహారం నుంచి మన శరీరం శోషించుకునే ప్రొటీన్ ఎంతన్నది ఇది సూచిస్తుంది. పప్పులు, గింజల్లో ఫైటేట్గా పిలిచే ఒక పదార్థం ఉంటుంది. ఇది ప్రొటీన్ల శోషణను నిరోధిస్తుంది. ఈ ఇబ్బంది మాంసాహారంలో ఉండదు. కాబట్టి, ఆహారం నుంచి శాకాహారులు పొందే ప్రొటీన్ కన్నా.. మాంసాహారులు అందుకునేదే ఎక్కువ. పప్పులను నానబెట్టి ఆ నీళ్లను వంపేసినప్పుడు ఫైటేట్లు కొంత వరకు వెళ్లిపోతాయి. ఆ పప్పును ఉడికించుకుని తినడం వల్ల తగినంత ప్రొటీన్ పొందవచ్చు.
సాధారణంగా సోయా, అలసందలతోపాటు మొల కెత్తిన గింజలు, పనీర్, బాదం, పాలలాంటి వాటిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మన శరీరానికి..ప్రతి కిలో బరువుకు 0.8 గ్రాముల ప్రొటీన్ అవసరం. మరీ ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు 1 నుంచి 1.2 గ్రాములు తీసుకోవాలి. పదిగ్రాముల బాదంలో సుమారు 2 గ్రా; కప్పు పప్పులో 3 నుంచి 4 గ్రా; 100 మిల్లీ లీటర్ల పాలలో 2 నుంచి 3 గ్రా; చొప్పున ప్రొటీన్ ఉంటుంది. శరీర బరువును బట్టి ప్రొటీన్ తీసుకోవాలి. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి.. పోషకాహార నిపుణులు బయటి సప్లిమెంట్లు సూచిస్తారు. ఏ కారణాల వల్ల అయినా వాడాలనుకుంటే,న్యూట్రిషనిస్ట్‌ను తప్పక సంప్రదించండి.
మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@ gmail.com