Diabetics travel food | మధుమేహంతో ఇబ్బంది పడుతున్నవారు తమ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మధుమేహంతో కలిగే ఆరోగ్యకర సమస్యలను తగ్గించుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. అందులోనూ ప్రయాణాల్లో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బయట తమకు అవసరమైన ఫుడ్ దొరకనందున ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ప్రయాణానికి ముందే ఆహారం ప్లాన్ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహార ప్రత్యామ్నాయాలను ప్యాక్ సిద్ధంగా పెట్టుకోవాలి.
బాదం పప్పు
బాదంపప్పులు ఆరోగ్యకరమైనవే కాకుండా ప్రయాణాల్లో సులభంగా తీసుకెళ్లేందుకు వీలుంటుంది. ఇవి డైటరీ ఫైబర్, విటమిన్ ఈ, మెగ్నీషియం కలిగి ఉండి మంచి పోషకాలను అందిస్తాయి. ఆకలిగా అనిపించినప్పుడల్లా వీటిని తినవచ్చు.
కోడిగుడ్డు
ప్రయాణాల్లో ఆరోగ్యకరమైన ఆహారం కోసం కోడిగుడ్లు చాలా ప్రయోజనకారి. బాగా ఉడికించిన గుడ్లను తీసుకెళ్లి తినాలి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేందుకు, ఆకలి బాధలను తగ్గించడానికి సహాయపడతాయి.
తాజా పండ్లు
ప్రయాణించేటప్పుడు అరటిపండ్లు, కివీలు, యాపిల్స్, పియర్స్ మొదలైన తాజా పండ్లను వెంట తీసుకెళ్లవచ్చు. శక్తిని పెంచుకోవడానికి ఈ పండ్లను తింటూ ఉండాలి. అయితే, ముక్కలుగా కోసి బయట విక్రయించే పండ్లను తినకుండా ఉండటం శ్రేయస్కరం.
రా వెజిటేబుల్స్
దోసకాయ, క్యారెట్ వంటి పచ్చి కూరగాయలను ప్రయాణించేటప్పుడు వెంట తీసుకెళ్లండి. వీలున్నప్పుడు వీటిని తింటూ ఉండాలి.
పెరుగు
మధుమేహం ఉన్నవారికి పెరుగు ఒక ఆరోగ్యకరమైన ఎంపిక. ఇందులో ప్రోటీన్, విటమిన్ డీ, ఫైబర్, కాల్షియం ఉండి పోషకాలు అందిస్తాయి. ప్రయాణం చేసేటప్పుడు బ్యాగులో పెరుగు ప్యాకెట్స్ ఉండేలా చూసుకోవడం చాలా మంచిది.
పాప్కార్న్
పాప్కార్న్ రుచికరమైనవే కాకుండా ఆరోగ్యకరమైనవి కూడా. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటున్నందున ఎక్కువ గంటలు రైళ్లలో లేదా విమానాల్లో కూర్చుని ప్రయాణం చేసే సమయాల్లో పాప్కార్న్ తినడం చాలా మంచిది.
చివరగా..
అయితే, ప్రయాణాలు చేసే సమయంలో కొర్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవద్దు. ప్యాకేజ్డ్ స్నాక్స్ తీసుకోవద్దు. కృత్రిమ చక్కెరలు ఉండే పానీయాలు, డ్రింక్స్ తాగకుండా చూసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.