మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మంచి పోషకాలున్న తిండి తింటేనే ఎక్కువ రోజులు ఎలాంటి రోగాలు లేకుండా ఆనందంగా జీవిస్తాం. ప్రస్తుతమున్న జీవనంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారింది. నిండైన ఆరోగ్యం కోసం పలు రకాల ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచనలిస్తున్నారు..
యాపిల్: యాపిల్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. యాపిల్స్‌లో అధిక శాతం ఫైబర్, విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి షుగర్, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి.
చేపలు: చేపల్లో ఉండే ఒమేగా-3 అనే ఫ్యాటీ యాసిడ్ గుండె జబ్బులను తగ్గించడంతోపాటు ఇన్ఫ్లమేషన్ను సైతం తగ్గిస్తుంది. చేపలు తినడం వల్ల శరీరానికి అధిక ప్రొటీన్లు అందుతాయి. విటమిన్ డి
సమృద్ధిగా లభిస్తుంది.
బ్లూ బెర్రీస్: వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా అంతోసైనిన్స్ అనే పదార్థం మన కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మెదడు సమస్యలు, గుండె సమస్యలు దరిచేరవు.
నట్స్: ఆల్మండ్, వాల్నట్స్, పిస్తా లాంటివి గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేషన్ను తగ్గించేందుకు ఉపకరిస్తాయి.
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్లో ఉండే ఫ్లేవనాయిడ్లు రక్త ప్రసరణ, గుండె, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. 70 శాతం అంతకంటే ఎక్కువ కోకో ఉండేవాటిని తీసుకోవడం ఉత్తమం.
అవకాడో: అవకాడోలో ఉండే పోటాషియం, ఫైబర్, కొవ్వులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె పనిని మెరుగుపరుస్తాయి. మానవుని మెదడు, జాయింట్ల పనితీరును సైతం మెరుగుపరుస్తాయి.
ఆలివ్ ఆయిల్: గుండె పనితీరు మెరుగుపర్చడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో ఆలివ్ నూనె ముందుంటుంది. కార్డియోవస్కులర్ సమస్య నుంచి సైతం రక్షణ కల్పిస్తుంది.
గ్రీన్ టీ: ప్రతిరోజు ఉదయం గ్రీన్ టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు జీవక్రియ సైతం క్రమపద్ధతిలో సాగుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటి ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణ కవచంగా పనిచేస్తాయి.