గుండెకు వ్యాయామం
వ్యాయామం మితంగా చేసినా గుండె రోగాలు ముప్పు తగ్గి పోతుంది. క్రమం తప్పని వ్యాయామానికీ; గుండెపోటు, ఏట్రియల్ ఫైబ్రిలేషన్ (ఏఎఫ్ఐబీ) ముప్పు తగ్గడానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ చేసిన తాజా అధ్యయనం వెల్లడించింది. ఇందులో 15,000 మంది పాల్గొన్నారు. వీరి సగటు వయసు 55 ఏండ్లు. వీరికి ఏఎఫ్ఐబీ ముందస్తు చరిత్ర లేదు. వీరంతా కూడా 2003 2012 మధ్య కాలంలో ట్రెడ్మిల్ మీద వ్యాయామం చేసినవారు కావడం గమనార్హం. ఇక సర్వేలో పాల్గొన్నవారి ఫిట్నెస్ స్థాయిని పరిశీలించడానికి మెట
బాలిక్ ఈక్వలెంట్స్ (ఎంఈటీస్) అనే కొలతను ఉపయోగించుకున్నారు. ఇది పరీక్ష సమయంలో వారివారి వ్యాయామ సామర్థ్యాన్ని నిర్ధారించింది. ఎక్కువ ఎంఈటీ స్కోరు ఉన్నవాళ్లలో ఏఎఫ్ఐబీ 8 శాతం తక్కువని ఫలితాల్లో తేలింది. అదే ఇస్కిమిక్ స్ట్రోక్ ముప్పు 12 శాతం, గుండె కవాటాలకు సంబంధించిన రుగ్మతల ప్రమాదం 14 శాతం తక్కువని తేల్చారు.
కాలుష్యంతో మెదడుకు చేటు
డీజిల్ కాలుష్యం ఊపిరితిత్తులకు మాత్రమే కాదు, మెదడు పని తీరుకూ చేటు చేస్తుందట. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. తమ పరిశోధన కోసం నిపుణులు కొద్ది మందిని ఎంపిక చేసుకున్నారు. వారిని విడతలవారీగా స్వచ్ఛమైన గాలి, డీజిల్ కాలుష్యం కలిసిన గాలి.. రెండూ పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేశారు. డీజిల్ కాలుష్యం పీల్చినవారిలో మెదడు పనితీరూ మందగించినట్టు తేలింది. ఈ పరిశోధన ఫలితం తాత్కాలిక ప్రభావం గురించిందే అయినా, కాలుష్యం దెబ్బ దీర్ఘకాలంలో ఏమేరకు ఉంటుందన్నది తేల్చలేదు. అయితే, ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినప్పుడు కార్లలో ప్రయాణిస్తున్నవారు కిటికీలు మూసివేయాలని, పాదచారులు, సైకిల్‌పై వెళ్లేవాళ్లు రద్దీలేని మార్గాలను ఎంచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
నిద్ర పుచ్చే పాప్సాంగ్స్
పడుకునేటప్పుడు మంద్రంగా, మనసుకు ఆహ్లాదంగా ఉండే సంగీతమో, పాటలో వింటే మెల్లగా నిద్రలోకి జారుకుంటామనేది తెలిసిన విషయమే. డెన్మార్క్ పరిశోధకులు 100 మందికి పైగా సంగీత ప్రియులపై ఓ అధ్యయనం చేశారు. మామూలు లలిత గేయాలతోపాటు బీటీఎస్ మొదలుకుని బిలీ ఎలిష్ వరకు ప్రముఖ పాప్ గాయకుల హై ఎనర్జీ పాటలు విన్నా కూడా ఇదే ఫలితం కనిపించిందట. మంద్రంగా ఉండే పాటలు మాత్రమే కాదు.. మెదడును రోజువారీ ఒత్తిళ్ల నుంచి దారిమళ్లించేవి ఏవైనా సరే మనకు ఇట్టే కునుకు తెప్పిస్తాయట.