Blood Clotting | గాయాలు అయినప్పుడు ఎవరికైనా సరే సహజంగానే కాసేపట్లో రక్తం గడ్డకడుతుంది. ఇది శరీరం నిర్వర్తించే సహజసిద్ధమైన ప్రక్రియ. దీని వల్ల తీవ్ర రక్త స్రావం అవకుండా ప్రాణాంతకం అవకుండా శరీరం తనను తాను రక్షించుకుంటుంది. అయితే కొందరికి రక్త నాళాల్లో రక్తం గడ్డ కడుతుంది. ఇది తీవ్రమైన అనారోగ్య సమస్య అని చెప్పవచ్చు. రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడాన్ని డీప్ వీన్ త్రాంబోసిస్ అంటారు. ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. హిమోగ్లోబిన్ స్థాయిలు అధికంగా ఉండడం, రక్తం లేదా ఎర్ర రక్త కణాలు మోతాదుకు మించి ఉత్పత్తి అవడం, కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను అతిగా తినడం, శరీరం లోపల రక్త నాళాలకు గాయాలు అవడం వంటి కారణాల వల్ల రక్త నాళాల్లో రక్తం గడ్డ కడుతుంది. అయితే ఈ సమస్యకు వైద్యులు మందులను ఇస్తారు. వాటిని క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. రక్తాన్ని పలుచగా చేసే మందులను వైద్యులు ఇస్తారు. అయితే ఆ మందులతోపాటు ఆహారం విషయంలోనూ పలు మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి సురక్షితంగా ఉండవచ్చు. ఫలితంగా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టే సమస్య ఉన్నవారు ఆహారాలను ఆచి తూచి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి, కొన్నింటిని తీసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ క్లాట్లను తగ్గించేందుకు పసుపు బాగా పనిచేస్తుంది. పసుపులో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. పసుపు వల్ల రక్త నాళాల వాపులను సైతం తగ్గించుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పసుపులో యాంటీ త్రాంబోటిక్, యాంటీ కో ఆగులంట్ లక్షణాలు ఉంటాయి. కనుక శరీరం లోపలి భాగంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడవు. పసుపును గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు ఒకసారి తాగాలి. రాత్రి పూట ఇలా చేస్తుండాలి. దీని వల్ల ఎంతగానో ఫలితం ఉంటుంది.
రక్త నాళాల వాపులను తగ్గించడంతోపాటు రక్త నాళాల్లో బ్లడ్ క్లాట్స్‌ను కరిగించేందుకు గాను వెల్లుల్లి కూడా ఎంతగానో పనిచేస్తుంది. ఇందులో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు బ్లడ్ క్లాట్స్‌ను కరిగిస్తాయి. రోజూ ఉదయం పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటుండాలి. దీని వల్ల బ్లడ్ క్లాట్స్ కరిగిపోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు రక్త నాళాలను వెడల్పుగా చేసి ప్రశాంతంగా మారేలా చేస్తాయి. దీని వల్ల హైబీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగు పడి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా పండు మిర్చి లేదా ఎండు మిర్చిని కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలోనూ రక్తాన్ని పలుచగా చేసే గుణాలు ఉంటాయి. వీటిల్లో సాలిసిలేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తం గడ్డ కట్టకుండా చూస్తాయి. వీటిల్లో ఉండే క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం రక్త నాళాల్లోని క్లాట్స్‌ను కరిగించి రక్త సరఫరా మెరుగు పడేలా చేస్తుంది. రక్త నాళాల్లో కొవ్వు చేరకుండా ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టే సమస్య ఉన్నవారు అర్జున చెట్టు బెరడును ఉపయోగిస్తుంటే మేలు జరుగుతుంది. ఈ బెరడును కొద్దిగా తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ నీళ్లను తాగాల్సి ఉంటుంది. ఇలా రోజూ చేస్తుండాలి. దీని వల్ల గుండె కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. వాపులు తగ్గిపోతాయి. రక్త నాళాల్లో ఉండే క్లాట్స్ కరుగుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అర్జున చెట్టు బెరడు మనకు మార్కెట్లో పొడి రూపంలోనూ లభిస్తుంది. దాన్ని కూడా ఉపయోగించవచ్చు. అలాగే రోజూ గుప్పెడు అవిసె గింజలను కాస్త పెనంపై వేయించి తింటున్నా ఉపయోగం ఉంటుంది. ఈ గింజల్లో అధికంగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా చూస్తాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా ఆయా ఆహారాలను తీసుకోవడం వల్ల రక్త నాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా చూసుకోవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.