Pranayamam | ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది చేసే వ్యాయామాల్లో యోగా కూడా ఒకటి. అయితే యోగాలో అనేక క్రియలు ఉన్నాయి. వాటిల్లో ప్రాణాయామం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. మనిషి శారీరకంగానే కాక మానసికంగా కూడా దృఢంగా ఉండేందుకు ప్రాణాయామం దోహదం చేస్తుంది. ప్రాణాయామం అంటే శక్తిని మేల్కొల్పడం అని యోగా నిపుణులు చెబుతుంటారు. ప్రాణాయామం మన శరీరానికి దివ్యౌషధం లాంటిది. దీని వల్ల మన శారీరక, మానసిక శక్తి రెండూ పెరుగుతాయి. మనపై మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనలో దాగి ఉన్న శక్తిని ప్రాణాయామం బయటకు తీస్తుంది. ప్రాణాయామం అంటే శ్వాసను నియంత్రించడమే. ప్రాణాయామంను రోజూ చేయడం వల్ల శరీరం తేలిగ్గా మారుతుంది. ప్రాణాయామానికి ఉన్న శక్తి అంతులేనిదని ఆయుర్వేదంలో కూడా చెప్పారు. ప్రస్తుతం మనిషి ఎదుర్కొంటున్న అనేక శారీరక, మానసిక సమస్యలను ప్రాణాయామంతో తగ్గించుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.
ప్రాణాయామం అంటే శ్వాసను నియంత్రణలో ఉంచడమే. సంస్కృతంలో ప్రాణ అంటే కీలకమైన ప్రాణశక్తి అనే అర్థం వస్తుంది. శ్వాసను గ్రహించడానికి కీలకమైన శక్తిని ఆయామ అంటారు. ప్రాణ ఆయామము అంటే ప్రాణశక్తిని (శ్వాస) నియంత్రించడమే. ప్రాణాయామ సాధన అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఒక క్రమంలోకి తేవడానికి ప్రయత్నించడమే. శ్వాసను పీల్చినప్పుడు పొట్ట ఒక క్రమ పద్ధతిలో ముందుకు వచ్చి శ్వాసను వదిలినప్పుడు పొట్ట ఖాళీ అవుతుంది. అయితే ప్రస్తుతం ప్రాణాయామం చేస్తున్న అధిక శాతం మందికి శరీరం ఈ విధంగా సహకరించడం లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలను ప్రాణశక్తి అంటారు. శ్వాస అనేది శరీరానికి, మనస్సుకు మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. శరీరం, మనస్సు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. శ్వాసను నియంత్రిస్తే ప్రాణశక్తి ఆధీనంలోకి వస్తుంది. దీని వల్ల అనేక శారీరక వ్యాధులతోపాటు మానసిక సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. శ్వాసలో ప్రాణ శక్తి ఉంటుంది, కనుక దాన్ని నియంత్రిస్తే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
సాధారణంగా ప్రాణాయామం యోగా అంత కష్టమైందేమీ కాదు. దీన్ని చేయడం చాలా సులభమే. ఎవరైనా దీన్ని చాలా సులభంగా అభ్యసించవచ్చు. అయితే గురువు వద్ద నేర్చుకుంటే చక్కగా ప్రాణాయామం చేయగలుగుతారు. ఇంకా ఎంతో ఫలితం ఉంటుంది. ప్రాణాయామాన్ని సాధారణంగా రోజూ ఉదయం తెల్లవారుజామున చేయాల్సి ఉంటుంది. ఉదయం 4 నుంచి 6 గంటల మధ్య ప్రాణాయామం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఆ సమయాన్ని అమృత ఘడియలుగా పిలుస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా అంత ఉదయం లేచి ప్రాణాయామం చేయడం కష్టం అని భావిస్తే ఉదయం నిద్ర లేచిన వెంటనే వ్యాయామంలో భాగంగా కూడా చేయవచ్చు. దీని వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇక ప్రాణాయామం చేసేందుకు గాను ముందుగా ప్రశాంతమైన వాతావరణంలో నేలపై చాప పరిచి దానిపై పద్మాసనంలో కూర్చోవాల్సి ఉంటుంది. తల, మెడ, ఛాతి, వెన్నెముకలను నిటారుగా ఉంచాలి. శ్వాసను క్రమబద్దం, లయబద్దం చేసి ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై దృష్టి పెట్టాలి. దీంతో ప్రాణాయామం సులభంగా చేయవచ్చు.
కేవలం శ్వాస పీల్చుకుని వదిలేస్తే ప్రాణాయామం కాదు. మనస్సును దానిపై కేంద్రీకరించాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. పీల్చే గాలి, వదిలే గాలిపైనే ధ్యాస ఉంచాలి. వేరే ఆలోచనలను మదిలోకి రానివ్వకూడదు. ప్రాణాయామంలో అనేక రకాలు ఉంటాయి. అన్నింటినీ రోజూ చేయలేరు. కానీ ఆరంభంలో సాధారణంగా అందరూ చేసే ప్రాణాయం చేయవచ్చు. అంటే ఒక నాసికా రంధ్రాన్ని మూసి మరో రంధ్రంతో గాలి పీల్చాలి. అనంతరం గాలి పీల్చిన నాసికా రంధ్రాన్ని వేలితో మూసి మరో రంధ్రంతో గాలిని వదలాలి. తరువాత మళ్లీ అదే రంధ్రంతో గాలిని పీల్చి అనంతరం దాన్ని మూసి తిరిగి ఇంకో రంధ్రంతో గాలిని వదలాలి. దీని వల్ల ఒక ప్రక్రియ పూర్తవుతుంది. ఇలా ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు కావల్సినంత సమయం పాటు ప్రాణాయామం చేయవచ్చు. ఇలా ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. బీపీ అదుపులో ఉంటుంది. గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా ఎన్నో రకాల లాభాలను ప్రాణాయామంతో పొందవచ్చు.