Healthy egg | గుడ్డు.. వెరీగుడ్ ఫుడ్. తక్కువ ఖరీదైనది.. ఎన్నో పోషకాలు కలిగి ఉన్నది. దీనిలో అతి తక్కువగా 78 క్యాలరీలు ఉంటాయి. గుడ్డులో విటమిన్ ఏ, బీ2, బీ5, బీ12, ఫోలేట్, ఫాస్పరస్, సెలీనియం ఉండి మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. అన్ని వయసుల వారు తినే ఏకైక ఆహారం ఇది. పచ్చసొనలో ఉండే కోలెస్ర్టాల్ అన్ని రకాల జీవక్రియలకు ఉపయోగపడుతుంది. వీటిని తినడం ద్వారా స్ట్రోక్, కార్డియాక్ మరణాలు, కార్డియోవాస్కులార్ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ నివారణకు తెల్ల సొన ఎంతో తోడ్పడుతుంది. ఉదయం వేళ గుడ్డును అల్పాహారంగా తీసుకుంటే ఊబకాయం నుంచి బయటపడొచ్చు.
బరువు తగ్గించుకోవచ్చు..
గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు ఆకలికాకుండా మనల్ని ఉంచడంలో సాయపడుతుంది. శరీరం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు పెరగాలనుకునే వారు కూడా గుడ్లను తినొచ్చు.
విటమిన్ డీ దొరుకుతుంది..
గుడ్డు సొనలో విటమిన్ డీ ఉంటుంది. విటమిన్ డీ.. ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం. కండరాల పనితీరును ప్రోత్సహించడంలో కూడా సాయపడుతుంది.
మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది..
ఇది మెదడును అభివృద్ధి చేయడంలో సాయపడుతుంది. నాడీ వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేయడంలో తోడ్పడుతుంది. ఇందులో లభించే కోలిన్, లూటిన్ మంటలను తగ్గిస్తాయి. జ్ఞాపకశక్తి సమస్యలను దూరం చేస్తాయి.
రోగనిరోధక వ్యవస్థ మెరుగవుతుంది..
గుడ్లలో లభించే సెలీనియం, విటమిన్ఏ, బీ12, జింక్ కారణంగా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. మనకు సత్వరమే శక్తి అందాలంటే గుడ్లు తినాలి.
గుండెకు ఎంతో ఆరోగ్యం..
గుడ్లు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. గుడ్డులోని కోలిన్ గుండె జబ్బులకు కారణమయ్యే అమినో యాసిడ్ హోమోసిస్టీన్ను విచ్ఛిన్నం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.
గర్బిణులకు మంచిది..
గర్బిణులు నిత్యం గుడ్లు తప్పనిసరిగా తీసుకోవడం అలవర్చుకోవడం ద్వారా ఫోలిక్ యాసిడ్ అందుతుంది. ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తుంది. అయితే, పూర్తిగా ఉడికినవి మాత్రమే తినాలి.
కళ్ల ఆరోగ్యం మెరుగు..
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం అత్యుత్తమం. గుడ్లలో ఉండే లూటిన్, జియాక్సంతిన్ కండరాల క్షీణతను, కంటి శుక్లం సమస్యలను నివారించడంతోపాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది.
చర్మానికి మంచిది..
గుడ్లు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఆరోగ్యకరమైన చర్మాన్ని కూడా వృద్ధి చేస్తుంది. ఇది కణజాలం విచ్ఛిన్నం కాకుండా నిరోధిస్తుంది. చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది.
చివరగా..
ఫ్రై చేసిన గుడ్లు తినాలా లేక ఉడకబెట్టిన గుడ్లు తినాలా..? పచ్చి కోడిగుడ్డు తినొచ్చా..? అని చాలా మందిలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. అయితే, బాగా ఉడకబెట్టిన గుడ్లను తినడమే చాలా మంచిది. పచ్చిగా తింటే బయోటిన్తో కలిసిపోయి దాన్ని శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటుంటుంది. పచ్చ సొన, తెల్ల సొన రెండూ తిన్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అయితే, మందులతో పెరిగే ఫారం కోడి గుడ్లను తినడం తగ్గించాలి. ఇకపోతే గుడ్డు పెంకుకు అందులోని పోషకాలకు ఎలాంటి సంబంధం ఉండదని గుర్తుంచుకోవాలి.