ఒకచిన్న బెల్లం ముక్క.. అనేక ఆరోగ్యప్రయోజనాలు అందిస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. శరీరానికి కావాల్సిన వివిధ ఖనిజాలు, విటమిన్లను అందిస్తుంది. అయితే.. ప్రస్తుతం బెల్లం కల్తీ ఎక్కువగా జరుగుతున్నది. కృత్రిమ రంగులు, సుద్ద పొడి కలుపుతుండటంతో అనారోగ్యాన్ని కలిగిస్తున్నది. అయితే, చిన్నచిన్న పరీక్షల ద్వారా.. బెల్లం నాణ్యతను ఇట్టే కనిపెట్టవచ్చు. అదెలాగంటే..
బెల్లం రంగును బట్టి ‘కల్తీ’ని గుర్తించొచ్చు. ఒక చిన్న బెల్లంముక్కను తీసుకొని ఒక గ్లాసు నీటిలో కరిగించండి. కొన్ని నిమిషాలు అలాగే వదిలేయండి. నీరు ఎక్కువగా రంగు మారినట్లు గుర్తిస్తే.. అందులో కృత్రిమ రంగులు కలిసినట్లే! స్వచ్ఛమైన బెల్లం ఎలాంటి రంగునూ విడుదల చేయదు.
చిన్న బెల్లం ముక్కను తీసుకొని.. గాజు గ్లాసులోని నీటిలో వేయండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత.. గ్లాసు అడుగున జాగ్రత్తగా గమనించండి. ఏవైనా తెల్లటి అవక్షేపాలు కనిపిస్తే.. కల్తీ అన్నట్టే! స్వచ్ఛమైన బెల్లం.. ఎలాంటి అవశేషాలు లేకుండా నీటిలో పూర్తిగా కరిగిపోతుంది.
స్వచ్ఛమైన బెల్లం.. తీపితోపాటు కొద్దిగా మట్టి రుచి కూడా వస్తుంది. పంచదార పాకం లాంటి వాసనను కలిగి ఉంటుంది. అదే కల్తీ బెల్లం.. మితిమీరిన తీపితో ఉంటుంది. రసాయనాలు ఎక్కువగా కలిపితే.. నాలుకకు ఘాటుగా తగులుతుంది.
బెల్లం ముక్కను కరిగించడం ద్వారా.. అందులో తీపికోసం చక్కెర కలిపారో లేదో తెలుసుకోవచ్చు. ఒక పాన్లో చిన్న బెల్లం ముక్కను వేసి.. వేడి చేయండి. అది ఏ విధంగా కరుగుతున్నదో గమనించండి. స్వచ్ఛమైన బెల్లం ఒక్కతీరుగా కరుగుతుంది. విడిపోకుండా మందపాటి పాకంగా మారుతుంది. అదే.. కల్తీ బెల్లం అయితే, పాన్పై చక్కెర స్ఫటికాలు, అవశేషాలు కనిపిస్తాయి.