Asafoetida Health Benefits | ఇంగువ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారతీయ వంటకాల్లో ఇంగువకు ప్రత్యేక స్థానం ఉంటుంది. భారతీయులు తమ వంటకాల్లో విరివిగా వినియోగిస్తారు. వంటకాలకు ప్రత్యేకంగా రుచి, సువాసనను ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి సైతం ఉపయోగకరంగా ఉంటుంది. ఆయుర్వేదంలో ఇంగువకు ప్రముఖ స్థానం ఉంది. ఇంగువను ఫెరులా అనే వృక్ష జాతికి చెందిన మొక్క పాల నుంచి తయారుచేస్తారు. వంటల్లో రుచి కోసం వాడే ఇంగువ, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంగువలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇంగువ వేసి చేసిన వంటలను తీసుకోవడం వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది.
అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ తదితర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఆకలి లేని వారు ఇంగువ వేసిన పదార్థాలను తింటే ఆకలి పుడుతుంది. కొన్ని రకాల అల్సర్లను తగ్గించడంలో కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంగువతో తయారైన ఆహారం తీసుకుంటే ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఇంగువ రక్తంలో కొవ్వు చేరకుండా చేస్తుంది. దీంతో రక్తప్రసరణ మెరుగై గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. తలనొప్పి, ఒంటి నొప్పులు వంటి నొప్పులను కూడా ఇది తగ్గిస్తుంది. ఇంగువను వంటల్లో కాకుండా మామూలుగా కూడా తీసుకోవచ్చు. చిటికెడు ఇంగువను గోరువెచ్చని నీరు, మజ్జిగలో కలిపి తాగితే ఆరోగ్య సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.