న్యూఢిల్లీ : ఆరోగ్యకరమైన ఆహారంతో కొవిడ్-19 ముప్పును నివారించవచ్చని, కరోనా మహమ్మారి సోకినా తీవ్ర లక్షణాల బారినపడకుండా నిరోధించవచ్చని జర్నల్ గట్లో ప్రచురితమైన అధ్యయనాన్ని ఉటంకిస్తూ హార్వర్డ్ హెల్త్ న్యూస్లెటర్ వెల్లడించింది. అధ్యయనంలో భాగంగా 5,93,000 మంది మధ్యవయస్కులు, వృద్ధుల ఆహార అలవాట్లను పరిశీలించిన మీదట ఈ జర్నల్ గట్ ఈ వివరాలు వెల్లడించింది.
పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తిన్నవారిలో తరచూ వీటిని తీసుకోని వారితో పోలిస్తే కొవిడ్-19 సోకే ముప్పు 9 శాతం తక్కువగా ఉందని, అధ్యయన సమయంలో వారు కొవిడ్-19 తీవ్ర లక్షణాల బారినపడే ముప్పు 41 శాతం తక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారని హార్వర్డ్ హెల్త్ లెటర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హిది గాడ్మన్ తెలిపారు. పోషకాహారం, సామాజికార్ధిక ప్రతికూలతలను అధిగమిస్తే మనం మూడోవంతు కొవిడ్-19 కేసులను నిరోధించవచ్చని అధ్యయన రచయిత జోర్డి మెరినో పేర్కొన్నారు. ఆరోగ్యకర ఆహారం కొవిడ్-19 ముప్పును, ఇన్ఫెక్షన్ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుందని తమ పరిశోధనలో వెల్లడైందని పరిశోధకులు స్పష్టం చేశారు.
ఆరోగ్యకర ఆహారానికి తోడు టీకాలు తీసుకోవడం, మాస్క్లు ధరించడం వంటి కొవిడ్-19 నిబంధనలు విధిగా పాటించాలని వారు స్పష్టం చేశారు. హార్వర్డ్ పరిశోధకుల ప్రకారం మెరుగైన ఆహారంలో భాగంగా మన ప్లేట్లో 50 శాతం కూరగాయలు, పండ్లు ఉండటంతో పాటు అన్ని రంగులతో కూడిన రెయిన్బో ఆహారం తీసుకోవాలి. ప్లేట్లో పావు శాతం తృణధాన్యాలు, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి ఉండాలి. అత్యధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన వైట్ బ్రెడ్, వైట్ రైస్ వంటి రిఫైన్డ్ ధాన్యాలను పక్కనపెట్టాలి. ఇక పావుశాతం చేపలు, పౌల్ట్రీ, బీన్స్, నట్స్ వంటి ప్రొటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.