గతంలో చిన్నపాటి చెవిపోటు కూడా ప్రాణాంతకమే! కానీ, యాంటీబయాటిక్స్‌తో అలాంటి ఎన్నో ఇన్ఫెక్షన్లకు పరిష్కారం దొరికింది. అయితే, వాటిని విచక్షణ రహితంగా వినియోగించడం కొత్త సమస్యలకు దారితీస్తున్నది. యాంటీబయా టిక్స్‌ను తట్టుకునేలా ఎన్నో బ్యాక్టీరియాలు రాటుదేలుతున్నాయి. పరిమితికి మించి వాడటం వల్ల లేనిపోని దుష్ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఆ మాటకొస్తే.. అసలు ఏ మందుకూ లొంగని సూపర్‌బగ్స్ కూడా పెరిగిపోతున్నాయి. ‘ఒక వ్యక్తి శరీరంలో ఎలాంటి బ్యాక్టీరియా ఉంది? దానికి ఏ మందు ఎంత మోతాదులో సరిపోతుంది?’ అన్నది కచ్చితంగా అంచనా వేయగలిగితే.. ఆయా మందులను సరైన రీతిలో ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ‘యాంటీబయాటిక్ సక్సెప్టబిలిటీ టెస్ట్’ అనే పరీక్ష లేకపోలేదు. కానీ, ఇది ఎంతో క్లిష్టమైనది. ఈ సమస్యకు ఇప్పుడు ఓ పరిష్కారం లభించింది. కెనడా పరిశోధకులు సెన్సర్‌ను రూపొందించారు. ఇది మన శరీరానికి అనుసంధానం కాగానే, లోపల బ్యాక్టీరియా తీవ్రత, వ్యాప్తి ఏ స్థాయిలో ఉన్నదో ఠక్కున చెప్పేస్తుంది. యాంటీబయాటిక్స్ వాడకంలో ఈ పరికరం అద్భుతాలు చేయనున్నదని పరిశోధకులు భావిస్తున్నారు.