H5N1 | ఇటీవల ప్రపంచంలో చాలా చోట్ల హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాల్లాగే ప్రారంభమయ్యే ఈ వైరస్ సంక్రమణ అరుదుగా మనుషులకు కూడా సోకే అవకాశం ఉంటుంది. అయితే మనుషుల మధ్య వ్యాప్తి చాలా అరుదుగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన పక్షులతో సన్నిహితంగా ఉండేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రారంభ లక్షణాలను గుర్తించడం, ప్రమాదంలో ఉన్నవారు ఎవరో తెలుసుకోవడం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ ముప్పును తగ్గించుకోవచ్చు. హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్‌లో ఒక రకం. ఇది ప్రధానంగా వ్యాధి సోకిన పక్షులు, కోళ్లు, వాటి విసర్జనలు లేదా లాలాజలంతో సన్నిహితంగా ఉండటం ద్వారా వ్యాపిస్తుంది. కలుషితమైన పరిసరాలు, పౌల్ట్రీ ఫారాలు, లైవ్ బర్డ్ మార్కెట్ల ద్వారా కూడా వైరస్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. అరుదైన సందర్భాల్లో మనుషులకు, ఇతర జంతువులకు కూడా ఈ వైరస్ సోకుతుంది.
వైరస్ సోకిన పక్షులతో సన్నిహితంగా మెలిగిన తర్వాత హెచ్5ఎన్1 లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభ దశలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, నీరసం, తలనొప్పి, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి సాధారణ జలుబు లేదా ఫ్లూ లక్షణాలను పోలి ఉండడంతో వైరస్‌ను ప్రారంభంలో గుర్తించడం కొంత కష్టంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరి అందకపోవడం, ఛాతిలో నొప్పి, న్యుమోనియా, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవడం అవసరం. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తగ్గకుండా కొనసాగుతున్న అధిక జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలు మరింత తీవ్రమవుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. హెచ్5ఎన్1 ఇన్ఫెక్షన్ కొన్ని సందర్భాల్లో వేగంగా తీవ్రతరం అవుతుందని ఆరోగ్య అధికారులు హెచ్చరిస్తున్నారు. పక్షులతో నిత్యం సన్నిహితంగా పనిచేసే వారికి హెచ్5ఎన్1 ముప్పు ఎక్కువగా ఉంటుంది. పౌల్ట్రీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పశువైద్యులు, లైవ్ బర్డ్ మార్కెట్లో పనిచేసేవారు, జంతు సంరక్షణ సిబ్బంది, అనారోగ్యంతో ఉన్న లేదా చనిపోయిన పక్షులను నిర్వహించే వ్యక్తులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలి.
అనారోగ్యంతో ఉన్న లేదా చనిపోయిన పక్షి కనిపించినప్పుడు దానిని చేతులతో నేరుగా తాకకూడదు. వీలైనంత త్వరగా సంబంధిత స్థానిక అధికారులకు సమాచారం అందించాలి. పెంపుడు జంతువులను కూడా అలాంటి పక్షులకు దూరంగా ఉంచడం మంచిది. పక్షులతో లేదా వాటి పరిసరాలతో సంబంధం ఏర్పడిన తర్వాత చేతులను సబ్బుతో పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. పక్షులను నిర్వహించాల్సిన పరిస్థితుల్లో తగిన రక్షణ పరికరాలను ఉపయోగించడం ద్వారా వైరస్‌కు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. కలుషితమైన ఉపరితలాలను కూడా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. అనారోగ్యంతో ఉన్న పక్షులతో సంబంధం ఏర్పడిన తర్వాత ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఉండటం కూడా ముఖ్యమే. బర్డ్ ఫ్లూ వ్యాప్తి సమయంలో చికెన్, గుడ్లు తినడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే వాటిని పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలి. సంబంధిత ఆరోగ్య అధికారులు వాటిని వినియోగానికి అనుమతించినవేనని నిర్ధారించుకోవడం అవసరం. పచ్చిగా లేదా సరిగా ఉడికించని చికెన్, గుడ్లు, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులను మాత్రం తీసుకోకూడదు.
చికెన్, గుడ్లను పూర్తిగా ఉడికించడం ద్వారా హెచ్5ఎన్1 వైరస్‌కు గురయ్యే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. పౌల్ట్రీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, వండడం వంటి ప్రతి దశలోనూ పరిశుభ్రత పాటించడం ముఖ్యం. అనుమానాస్పదంగా ఉన్న లేదా ఆరోగ్య అధికారులు వినియోగానికి అనుమతించని పౌల్ట్రీ ఉత్పత్తులను తీసుకోవద్దు. మనుషుల మధ్య హెచ్5ఎన్1 వ్యాప్తి చాలా అరుదుగా జరుగుతుంది. అయితే వైరస్‌లో మార్పులు చోటుచేసుకున్నప్పుడు మనుషుల మధ్య వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని ఆరోగ్య సంస్థలు చెబుతుస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కేసులను నిరంతరం గమనిస్తూ, వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో అంచనా వేస్తున్నారు. ప్రజలు భయపడకుండా, అనారోగ్యంతో ఉన్న పక్షులకు దూరంగా ఉండటం, పరిశుభ్రత పాటించడం, పౌల్ట్రీ ఉత్పత్తులను పూర్తిగా ఉడికించి తినడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ముప్పును తగ్గించుకోవచ్చు.