జెస్టేషనల్ డయాబెటిస్.. మహిళల్లో గర్భధారణ సమయంలో కనిపిస్తుంది. చాలామందిలో ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. కానీ, మూడింట ఒకవంతు మంది మహిళలు.. డెలివరీ తర్వాత కూడా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారట. ఈ క్రమంలో కాన్పు తర్వాత ‘గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్’ చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. కానీ, చాలామంది మహిళలు ఈ పరీక్షలు చేయించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రసవం తర్వాత పిల్లల కోసమే పూర్తి సమయాన్ని కేటాయిస్తూ.. తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు.
‘టాలరెన్స్ షుగర్ పరీక్ష’కు చాలామంది మహిళలు విముఖత చూపుతున్నారని తాజా పరిశోధన ఒకటి తేల్చింది. కెనడాకు చెందిన లునెన్ఫీల్డ్ – టానెన్బామ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేపట్టిన ఈ పరిశోధన వివరాలను ‘డయాబెటిస్ కేర్’ ప్రచురించింది. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘గ్లూకోజ్ టాలరెన్స్’ పరీక్ష చేయించుకోవాలంటే.. బాలింతలు రాత్రిపూట ఉపవాసం ఉండి, మరుసటి రోజు ఉదయం పరీక్షకు రావాల్సి ఉంటుంది. శాంపిల్ ఇచ్చిన తర్వాత.. ఆహారం తీసుకొని, మళ్లీ రెండు గంటలపాటు వేచి ఉండి, మరోసారి రక్తం శాంపిల్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో, ఎక్కువ సమయంపాటు వేచి చూడటం, రాత్రిపూట ఉపవాసం.. ఇలాంటి కారణాలతో మహిళలు ఈ పరీక్ష చేయించుకోవడానికి విముఖత చూపుతున్నారట.
ఈ సమస్యను గుర్తించిన అంతర్జాతీయ డయాబెటిస్ సమాఖ్య.. ఈ పరీక్ష వ్యవధిని ఒక గంటకు తగ్గించాలని సిఫార్సు చేసింది. ఇలా, ఒక గంటలో పూర్తిచేసే పరీక్ష.. రక్తంలో చక్కెర స్థాయులను కచ్చితంగా అంచనా వేస్తుందని పరిశోధనలో తేలింది. ఇందులో భాగంగా.. 369 మంది మహిళలను ఎంపికచేసింది. వీరిలో కొందరికి ప్రసవానంతరం రెండు గంటల టాలరెన్స్ టెస్ట్ చేయగా.. మరికొందరికి గంటలో పూర్తయ్యే పరీక్ష నిర్వహించారు. ఆశ్చర్యకరంగా.. రెండు రకాల పరీక్షల ఫలితాలు సరిపోలినట్టు పరిశోధకులు వెల్లడించారు. ఈ చిన్న పరీక్షతో భవిష్యత్తులో షుగర్ వ్యాధి ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.